పాత జిల్లాల ప్రకారమే టీఆర్టీ - MicTv.in - Telugu News
mictv telugu

పాత జిల్లాల ప్రకారమే టీఆర్టీ

November 24, 2017

ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్‌టీ) వ్యవహారంలో తెలంగాణ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురైంది. టీఆర్టీ జీవోను సవరించి తీరాల్సిందేనని, పాత 10 జిల్లాల ప్రకారమే నోటిఫికేషన్ ఉండాలని కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. పాత 10 జిల్లాల ప్రాతిపదికన కాకుండా కొత్త 31 జిల్లాల ప్రాతిపదికన పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేయడం తెలిసిందే. అయితే అది రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని కొందరు కోర్టుకెక్కారు. ఇదివరకటి 10 జిల్లాలకే రాష్ట్రపతి ఆమోదముందని వాదించారు. 31 జిల్లాల ప్రకారం పరీక్ష నిర్వహిస్తే పూర్వపు జిల్లాలో స్థానికేతరుడిగా అభ్యర్థి నష్టపోతున్నారన్నారు.  పాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు  ఏర్పాటు చేశామన్న సర్కారు ఉద్యోగ నియామకాలకు కూడా కొత్త జిల్లాల్ని ప్రామాణికంగా తీసుకోవడం చట్ట విరుద్ధమని వాదించారు. ప్రభుత్వం వాదిస్తూ..  అభ్యర్థులు పది జిల్లాల్లో ఎక్కడి వారో తెలుసుకునేందుకు అధికారులకు ఇబ్బందేమీ లేదన్నారు. 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకుని పరీక్ష నిర్వహిస్తే స్థాని క అభ్యర్థులకు అన్యాయం జరగదన్నారు. అయినా కోర్టు పట్టించుకోలేదు. పాతజిల్లాల ప్రకారమే నోటిఫికేషన్ ఉండాలంటూ తీర్పునిచ్చింది.