Teachers should not use cell phones: Sabita Indra Reddy
mictv telugu

ఉపాధ్యాయులు సెల్‌ఫోన్లు వాడొద్దు: సబితా ఇంద్రారెడ్డి

September 16, 2022

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న వారికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఏ ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు తరగతి గదిలో సెల్‌ఫోన్లు వాడొద్దని హెచ్చరించారు. మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధాయ్యులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఆమె సూచించారు. ఈ నిర్ణయానికి గల కారణాన్ని కూడా ఆమె తెలియజేశారు.

”ఇటీవలి కాలంలో ఉపాధ్యాయుల్లో అత్యధికులు తరగతి గదుల్లో సెల్‌ఫోన్లు వాడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఇది విద్యార్థులకు వ్యాపించే అవకాశముంది. పిల్లల ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇకపై తరగతి గదిలో సెల్‌ఫోన్ వాడితే, కఠిన చర్యలు ఉంటాయి” ఆమె పేర్కొన్నారు. ఈ సెల్‌ఫోన్ల వినియోగంపై పలు జిల్లాల డీఈవోలు ఆదేశాలిచ్చారు. పాఠశాలల హెచ్ఎంలు, కేజీబీవీల స్పెషలాఫీసర్లు, మాడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు తగు చర్యలు తీసుకొని, ఈ ఆదేశాలు కఠినంగా పాటించేలా చూడాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని ఆదేశించారు.

ఇక, తెలంగాణ రాష్ట్రంలోని విద్య విషయానికొస్తే..కేసీఆర్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధినీ, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది. తెలుగు మాధ్యమంతోపాటు, ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. కరోనా కారణంగా రెండు సంవత్సరాలపాటు పాఠశాలలు మూతపడడంతో, పిల్లలకు చదువుపై ఆసక్తి తగ్గింది. దీంతో పాఠశాలల ప్రారంభమైప్పటికి పిల్లల్లో ఏకాగ్రత లోపించింది. ఇందుకోసం విద్యాశాఖ తొలిమెట్టు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, విద్యార్థులు చేయాల్సిన రోజువారి ప్రణాళికలు రెడీ చేసి, వారికి విద్యపై ఏకాగ్రత కల్పించేలా చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు తరగతి గదిలో ఉపాధ్యాయులు సెల్‌ఫోన్లు వాడొద్దిన ఆదేశాలు ఇచ్చింది.