Team India had a fantastic win over Zimbabwe
mictv telugu

కట్టడి చేసిన బౌలర్లు.. జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం

November 6, 2022

టీ20 ప్రపంచకప్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించింది. జింబాబ్వేపై 71 పరుగుల తేడాతో గెలుపొంది లీగ్ దశను విజయవంతంగా ముగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. సూర్యకుమార్ చిచ్చరపిడుగులా చెలరేగి ఆడాడు. అనంతరం 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే మొదట్లోనే చతికిలపడింది. తొలి బంతికే వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. పవర్ ప్లే వరకు నెట్టుకొచ్చిన ప్రత్యర్ధి జట్టు.. అక్షర్ పటేల్ బౌలింగులో మాత్రం పరుగుల వరద పారించింది. ఈ సమయంలో చెలరేగి ఆడుతున్న ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ సికిందర్ రజాను హార్దిక్ ఔట్ చేయడంతో మ్యాచ్ పూర్తిగా భారత్ చేతుల్లోకి వచ్చేసింది. ఇక మిగిలిన టెయిలెండర్ల పని అశ్విన్ పూర్తి చేయడంతో జింబాబ్వే ఓటమి ఖాయమైపోయింది. మొత్తం పది వికెట్లకు 115 పరుగులు మాత్రమే చేసి ఇంటి దారి పట్టింది. అశ్విన్ 3 వికెట్లు, హార్ధిక్, షమిలు చెరో రెండు వికెట్లు, అక్షర్ పటేల్, భువీ, అర్షదీప్ సింగ్ తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంలో పాయింట్ల పట్టికలో టీమిండియా 8 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో సెమీస్‌లో గ్రూప్ 1లో నెంబర్ 2 గా ఉన్న ఇంగ్లాండ్‌తో తలపడనుంది. న్యూజిలాండ్, పాకిస్తాన్ మధ్య మరో సెమీస్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచులలో గెలుపొందిన జట్లు ఫైనల్‌లో తలపడతాయి.