Team India has to win today
mictv telugu

టీమిండియాకు నేడు చావోరేవో..గెలవాల్సిందే

September 6, 2022

ఆసియా కప్ సూపర్-4లో భాగంగా ఈరోజు (మంగళవారం) రాత్రి 7.30 గంటలకు టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ మొదలుకానుంది. ఈ మ్యాచ్‌‌ టీమిండియా జట్టుకు చావోరేవో లాంటింది. ఎందుకంటే ఆసియా కప్ పోరులో భారత జట్టు ఫైనల్ రేసులో నిలవాలంటే, ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. ఇప్పటికే సూపర్-4లో శ్రీలంక జట్టు పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైంది. ఈ క్రమంలో నేడు భారత్‌పై గెలుపే లక్ష్యంగా శ్రీలంక జట్టు పోరుకు సిద్దమైంది.

ఈ మ్యాచ్ అనంతరం..సూపర్-4లో ఒక్కో జట్టు మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ చొప్పున ఆడుతోంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు పైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇప్పటికే భారత్‌పై పాక్, అఫ్ఘానిస్థాన్‌పై శ్రీలంక గెలిచాయి. ఈరోజు జరిగే మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో భారత్ ఓడితే..ఫైనల్‌కు దారి దాదాపుగా మూసుకుపోయినట్లే. చివరి మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌పై భారత్ గెలిచినా చాలా సమీకరణాలు కలిసి రావాలి. అఫ్ఘానిస్థాన్‌పై పాకిస్తాన్ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అలా జరిగితే, పాక్, శ్రీలంక మధ్య జరిగే చివరి సూపర్-4 మ్యాచ్‌లో గెలిచిన జట్టు..మూడు విజయాలతో అగ్రస్థానంలోకి వెళ్తుంది. ఓడిన జట్టు రెండో స్థానాన్ని దక్కించుకునే ఛాన్స్ ఉంది. కాబట్టి భారత్ ఒకే విజయంతో టోర్నీని వీడాల్సి వస్తుంది. అందుకే లంకతో మ్యాచ్‌లో విజయం మనకు అత్యావశ్యకం. ఈ మ్యాచ్‌లో గెలిచి, చివరి పోరులో అఫ్ఘానిస్థాన్‌ను ఓడిస్తే భారత్‌కు తుదిపోరు చేరే అవకాశాలుంటాయి.

తుది జట్ల ఎంపిక అంచనా…

భారత్.. రోహిత్, కేఎల్ రాహుల్, కోహ్లి, సూర్యకుమార్, దినేశ్ కార్తీక్/పంత్, హార్దిక్, అక్షర్, భువనేశ్వర్, అవేశ్/రవి బిష్ణోయ్, అర్షదీప్, చాహల్ /అశ్విన్.

శ్రీలంక.. నిశాంక, కుశాల్, అసలంక, గుణతిలక, భానుక రాజపక్స, శనక, హసరంగ, చామిక కరుణరత్నె, తీక్షణ, అసిత, దిల్షాన్ మదుశంక..