బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆసక్తికరంగా మారింది. భారత్ ఏకపక్ష విజయాలకు మూడో టెస్ట్‌లో ఆసీస్ బ్రేక్ వేసింది. దీంతో అహ్మదాబాద్ వేదికగా గురువారం జరగనున్న నాలుగో టెస్ట్‌పై ఉత్కంఠ నెలకొంది. విజయంతో సిరీస్ పట్టేయడంతో పాటు..టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలని భారత్ ఆలోచనచేస్తుండగా..సిరీస్‌ను సమం చేయాలని కంగారు జట్టు భావిస్తోంది.ఇక గురువారం జరగబోయే మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధం అవతున్నాయి.
ఇదే సమయంలో మరోసారి పిచ్‌పై రచ్చ మొదలైంది. ఇండోర్ పిచ్‌పై ఐసీసీ పూర్ రేటింగ్ ఇచ్చిన నేపథ్యంలో చివరి టెస్ట్ పిచ్ రిపోర్ట్‌పై ప్రాధాన్యం సంతరించుకుంది. మొదటి మూడు లా స్పిన్ పిచ్ తయారు చేసిందా..లేదా మార్చిందా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే మ్యాచ్ కోసం రెండు పిచ్‌లను మాత్రం తయారు చేసి ఉంచారు. టీమిండియా మేనేజ్‌మెంట్ ఎలాంటి ఇన్పుట్స్ రాని కారణగా నార్మల్ పిచ్‌ను తయారు చేసినట్లు నరేంద్ర మోదీ స్టేడియం క్యూరేటర్లు తెలిపారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటికి అనుకూలించే విధంగా పిచ్ ను సిద్ధం చేసినట్లు చెప్పారు.
పిచ్‌ల వివాదంపై టీం ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిచ్‌లపై మరీ అంత ఎక్కువ చర్చ అవసరం లేదని అన్నాడు. ఇండోర్ పిచ్ వివాదం తానేమీ మాట్లాడుదలుచుకోలేదని చెప్పాడు. మ్యాచ్ రిఫరీ తన నిర్ణయం తాను తీసుకుంటాడని వివరించాడు. డబ్ల్యూటీసీ పాయింట్ల నేపథ్యంలో అందరూ ఫలితాలు ఇచ్చే పిచ్‌లనే తయారు చేస్తున్నారని ద్రవిడ్ స్పష్టం చేశాడు. ఒక్క ఇండియాలోనే కాదని ప్రతీ దేశంలో ఇదే జరుగుతుందని వెల్లడించాడు.