బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న భారత్.. తొలి వన్డేలోనే తీవ్రంగా నిరాశపరిచింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా.. 41.2 ఓవర్లలో 186 పరుగులు ఆల్ ఔట్ అయింది. కేఎల్ రాహుల్ (73) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. 11వ ఓవర్ ముగిసేసరికి భారత్ 3 వికెట్లు కోల్పోయి కేవలం 49 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా కాసేపటికే శ్రేయాస్ కూడా పెవిలియన్ బాటపట్టాడు.
కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్ గా వచ్చిన శిఖర్ ధవన్ 17 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేశాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో స్పిన్నర్ మెహ్దీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో వన్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ మంచి షాట్లతో కాసేపు ఆకట్టుకున్నాడు. కానీ, 11వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన బంగ్లా బౌలర్ షకీబ్ అల్ హసన్.. కేవలం మూడు బంతుల తేడాతో రోహిత్, కోహ్లీని ఔట్ చేశాడు. 31 బంతుల్లో 27 రన్స్ చేసిన రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 15 బంతుల్లో 9 పరుగులు చేసిన కోహ్లీ.. షకీబ్ బాల్ డ్రైవ్ చేయగా.. ఎక్స్ ట్రా కవర్ లో బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో పట్టిన క్యాచ్ కు వెనుదిరిగాడు. ఈ క్యాచ్ చూసి విరాట్ సైతం ఆశ్చర్యపోయారు.
బంగ్లా బౌలర్ల ధాటికి క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయారు. మిడిలార్డర్లో రాహుల్ ఆఫ్ సెంచరీ(73)తో రాణించడంతో 41.2 ఓవర్లలో భారత్ 186 పరుగులకు ఆలౌట్ అయింది. టాప్ ఆర్డర్లో రోహిత్(27), శ్రేయస్ అయ్యర్(24), వాషింగ్టన్ సుందర్ (19) మినహా మిగతావారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ ఐదు వికెట్లు పడగొట్టగా.. ఎబాదత్ 4, మిరాజ్ ఒక వికెట్ తీశారు.