శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ అతి కష్టం మీద గెలిచింది. లక్ష్యం చిన్నదైనా విజయం కోసం చెమటోడ్చింది. లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చిన్న టార్గెట్ ఛేదించడానికి 43 ఓవర్లు తీసుకుంది. లోకేష్ రాహుల్ (103 బంతుల్లో 64) ఎట్టకేలకు రాణించి చివరి వరకు క్రీజులో ఉండడంతో నాలుగు వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. హార్ధిక్ పాండ్యా (36), అయ్యర్ (28), పరుగులతో రాణించగా, కోహ్లీ 4 పరుగులు చేసి ఔటయ్యాడు. లంక బౌలర్లలో కుమార, కరుణరత్నే చెరో రెండు వికెట్లు, ధనుంజయ డిసిల్వా, కసున్ రజిత ఒక్కో వికెట్ పడగొట్టారు. అంతకుముందు లంక 215 పరుగులకు ఆలౌటయింది. భారత్ 43.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసి సిరీస్ ని కైవసం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్ లో చివరి మ్యాచ్ ఈ నెల 15న జరుగనుంది.