సిక్సర్ల ధోని..! - MicTv.in - Telugu News
mictv telugu

సిక్సర్ల ధోని..!

July 1, 2017

విదేశీ గడ్డపై ధోనీ మెరుపులు మెరిపించాడు. విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. నాలుగు ఫోర్లు, రెండు సిక్స్ లతో 78 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి మరోసారి స్పెషాలిటీని ఫ్రూవ్ చేశాడు. వన్డేల్లో ధోనీ భారత్‌ తరఫున అత్యధికంగా 200పైగా సిక్స్‌లు బాదిన ఆటగాడిగా అరుదైన ఘనతను అందుకున్నాడు. ఇప్పటి వరకు ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌(వన్డే, టెస్టు, టీ20)లో 322 సిక్స్‌లు సాధించాడు.

నార్త్‌సౌండ్‌ వేదికగా వివ్‌ రిచర్డ్స్‌ మైదానంలో భారత్‌తో జరిగిన మూడో వన్డేలో ఆతిథ్య వెస్టిండీస్‌ చిత్తుగా ఓడింది. ఛేజింగ్ లో ఆజట్టు బ్యాట్స్‌మెన్‌ ఏమాత్రం పోరాట పటిమ కనబర్చకపోవడంతో 38.1 ఓవర్లలో కేవలం 158 పరుగులకే ఆలౌటైంది. స్పిన్‌ ద్వయం అశ్విన్‌(3/28), కుల్‌దీప్‌ యాదవ్‌(3/41) కరీబియన్‌ను తిప్పేశారు. దీంతో భారత్‌ 93 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది.

ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ 2-0తో ఆధిక్యం సాధించింది. అంతకుముందు భారత్‌ ఇన్నింగ్స్ లో మహేంద్రసింగ్‌(78), రహానె(72) మెరవడంతో నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లకు 251 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డును ధోనీ అందుకున్నాడు.ఇక వన్డేల్లో 150 వికెట్లు తీసిన భారత స్పిన్నర్ల జాబితాలో అశ్విన్‌ చేరాడు. అరంగేట్రం చేసిన మొదటి రెండు వన్డేల్లో (3/50, 3/41) వరుసగా మూడు వికెట్లు పడగొట్టిన రెండో భారత బౌలర్‌గా కుల్‌దీప్‌ అరుదైన ఘనత సాధించాడు.