తెలంగాణ నిరుద్యోగులకు టీశాట్ శుభవార్త - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ నిరుద్యోగులకు టీశాట్ శుభవార్త

March 30, 2022

 

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 91 వేల ప్రభుత్వ ఉద్యోగాలను త్వరలోనే దశలవారీగా భర్తీ చేస్తామని కేసీఆర్ ఈనెల 9వ తేదీన అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలి దశలో 30 వేల ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతులు జారీ చేసింది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పట్టడం కోసం ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. మరికొంతమంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల బాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో టీశాట్ 33 జిల్లాలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.

ఏప్రిల్ 4 నుంచి టెట్‌కు కోచింగ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా త్వరలోనే రానున్న గ్రూప్-1తోపాటు అన్నీ నోటిఫికేషన్లకు కోచింగ్ సెంటర్లకు దీటుగా శిక్షణ ఇవ్వనున్నామని తెలిపింది. గ్రూప్-1, టెట్, టీచర్ పోస్టులు, పోలీస్, వైద్యశాఖలోని పలు పోస్టులకు పోటీ పడుతున్నవారికి కోచింగ్ సెంటర్లకు తీసిపోని విధంగా ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొంది. ఏప్రిల్ 4 నుంచి మొదలుకానున్న ఈ శిక్షణలో భాగంగా..టెట్‌కు ఏప్రిల్ 4 నుంచి మే 4 వరకు 60 రోజులపాటు 102 ఎపిసోడ్ల ద్వారా శిక్షణ ఇస్తామని తెలిపింది. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఒక్కో సబ్జెక్టుకు 30 నిమిషాలపాటు పాఠ్యాంశాలను ప్రసారం చేస్తామని ప్రకటించింది.

అనంతరం గ్రూప్-1 శిక్షణను కూడా నోటిఫికేషన్ పడగానే ప్రారంభించనుంది. రోజుకు రెండుగంటలపాటు శిక్షణ ఇచ్చేలా అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. నోటిఫికేషన్ విడుదలైన నాలుగు రోజుల్లోనే శిక్షణను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. టీఎస్ మనటీవీ వీడియో రికార్డులను సిద్ధం చేశారు. ”కావున నిరుద్యోగులు కోచింగ్ కేంద్రాలకు వెళ్లి అప్పులపాలు కావొద్దు. కోచింగ్ సెంటర్లలో షెడ్యూల్‌ను బట్టే పాఠాలు చెప్తారు. కానీ, టీశాట్ పాఠాలను ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎన్నిసార్లయినా వినొచ్చు. నోటిఫికేషన్ల నేపథ్యంలో టీశాట్ ద్వారా అన్ని రకాల కోచింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. లైవ్ ఇంటరాక్టన్స్ ఉంటాయి. హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశాం. అభ్యర్థులంతా టీశాట్ పాఠ్యాంశాలను సద్వినియోగం చేసుకోవాలి” అని టీశాట్ యాజమాన్యం కోరింది.