ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోలేక బడా బడా కంపనీలు భారీ స్థాయిలో లేఆఫ్‌లు ప్రకటిస్తూ లక్షల మంది ఉద్యోగులను తీసేస్తున్నాయి. కొన్ని చక్కగా నోటీసులు ఇచ్చి పంపేస్తుంటే కొన్ని ఆఫీసు పని మధ్యలో ఉన్నప్పుడు చల్ బేటా అంటున్నాయి. ఉద్యోగం ఎప్పుడు పోతుందా అని కోట్లమంది బితుకుబితుకుమంటున్నారు. మైక్రోసాఫ్, అమెజాన్, గూగుల్, ట్విటర్, ఫేస్‌బుక్ వంటి ఇంటర్నేషనల్ కంపెనీల నుంచి గల్లీ షాపుల వరకు అదే పరిస్థితి. ప్రముఖ టెక్ దిగ్గజం ఇంటెల్ కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అయితే ఉద్యోగులను శాశ్వతంగా ఇంటికి పంపకుండా మధ్యేమార్గంగా జీతంలో కొంత కోత పెట్టి పెద్ద దయతో వదిలేసింది.
సీఈవో స్థాయి నుంచి కింది స్థాయి ఉద్యోగులందరీకి జీతాన్ని కత్తిరిస్తోంది.
ఈ నిర్ణయంతో సీఈవో పాట్ గెల్‌సింగర్ వేతనంలో 25 శాతం తగ్గింది. ఎగ్జిక్యూటివ్ లెవల్ ఉద్యోగులకు 15 శాతం, సీనియర్ మేనేజర్లకు 10 శాతం, మిడిల్ లెవెల్ మేనేజర్లకు 5 శాతం కోత పడిది. తప్పని పరిస్థితిలోనే భారాన్ని తగ్గించడానికి కోత వేశామని కంపెనీ తెలిపింది. ఇంటెల్ నిర్ణయాన్ని ఉద్యోగులతోపాటు ఆర్థిక నిపుణులు కూడా మెచ్చుకుంటున్నారు. ఉన్నపళంగా ఉద్యోగం పీకేయకుండా కొంతలో కొంత ఊరట ఇచ్చిందని, మిగతా కంపెనీలు కూడా ఈ మార్గంలో నడవాలని కోరుతున్నారు.