ప్రియుడు అజయ్ మోసం చేశాడని టెకీ శ్వేత రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే శ్వేత ఆడియో టేపులు తాజాగా బయటకు రావడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఆత్మహత్యకు ప్రియుడే కారణం అని పోలీసులు తేల్చారు. ఈ మేరకు అజయ్‌ను హఫీజ్‌పేట్‌లో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అజయ్‌ని అదుపులోకి తీసుకుని విచారించి పలు కీలక నిజాలను రాబట్టారు. శ్వేత ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఆమె ఫొటోలను అజయ్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వేధించినట్టు గుర్తించారు.
ఆడియో టేపుల్లో అజయ్ తల్లి, సోదరితో ఫోన్లో శ్వేత మాట్లాడినట్లు ఉంది. తన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వేధిస్తున్నాడని అజయ్ కుటుంబీకులకు శ్వేత ఫోన్లో చెప్పింది. తన ఫోటోలు తొలగించమని చెబుతున్నా వాటిని తీయడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎలాగైనా వాటిని తొలగించేలా చూడాలని అజయ్ తల్లి, సోదరి ఇద్దరినీ శ్వేత బతిమాలినట్లు ఆడియో టేపుల్లో ఉంది. మరోవైపు ప్రేమ, పెళ్లి పేరుతో శ్వేతను అజయ్ మోసం చేశాడని.. తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని శ్వేత తల్లిదండ్రులు అన్నారు. శ్వేతను అజయ్ ప్రేమ పేరిట బ్లాక్ మెయిల్ చేశాడని.. వ్యక్తిగత ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశాడని వారు మీడియాకు తెలిపారు. ఆ అవమానం తట్టుకోలేకే శ్వేత డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్య చేసుకుందని కన్నీరుమున్నీరు అయ్యారు.