రూ.1000 కొడితే రూ.2000.. ఏటీఎం ముందు ఎగబడ్డ జనం - MicTv.in - Telugu News
mictv telugu

రూ.1000 కొడితే రూ.2000.. ఏటీఎం ముందు ఎగబడ్డ జనం

October 26, 2022

Siddipet: ATM dispenses Rs 2,000 instead of Rs 1,000; people queue up

 

దీపావళి వేళ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసిన కస్టమర్లకు లక్ష్మీ దేవి కరుణించినట్లయింది. రూ.1000 డ్రా చేస్తే రూ.2000 వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట పట్టణంలోని కమాన్‌ రోడ్డులో గల BOI(బ్యాంక్ ఆఫ్ ఇండియా) బ్యాంక్‌ ఏటీఎంలో మంగళవారం టెక్నికల్ ప్రాబ్లెం కారణంగా వినియోగదారులు డ్రాచేసిన డబ్బుల కంటే అధికంగా వచ్చాయి. మంగళవారం ఓ వ్యక్తి ఈ ఏటీఎంలో రూ.1000 విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించారు. అయితే.. రూ.1000కి బదులు.. రూ.2000 రావడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. మరోసారి అదే విధంగా చేయగా.. మళ్లీ రూ.2,000 వచ్చాయి. దీంతో స్థానికంగా ఈ విషయం ఒక్కసారిగా దావానలంలా వ్యాపించింది.

వెంటనే నగదు ఉపసంహరణ కోసం స్థానికులు పెద్దఎత్తున ఏటీఎం వద్ద గుమిగూడారు. ఈ క్రమంలోనే బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని ఏటీఎం కేంద్రాన్ని మూసివేశారు. డబ్బులు ఎక్కువ వస్తే బ్యాంకు సిబ్బందికి సమాచారం ఇవ్వాలి గానీ.. ఇలా అందరూ ఎగబడి డ్రా చేయడం ఏంటని బ్యాంకు అధికారులు అసహనం వ్యక్తం చేశారు. అయితే.. అవన్నీ తమకు ఎందుకని ప్రజలు అంటున్నారు. బ్యాంకు అధికారులు రాకముందు డ్రా చేసుకున్న వారు ఖుషీగా ఇంటికి వెళ్తే.. డ్రా చేయని వారు మాత్రం నిరాశగా వెనుదిరిగారు.