సైకిల్‌పై గాయపడిన తండ్రి.. 1200 కి.మీ తొక్కిన బాలిక  - MicTv.in - Telugu News
mictv telugu

 సైకిల్‌పై గాయపడిన తండ్రి.. 1200 కి.మీ తొక్కిన బాలిక 

May 20, 2020

Teenage  girl covers nearly 1200 km, brings injured father

రెక్కడితేగాని డొక్కాడని జనం చరిత్ర ఎరగని చరిత్రలు సృష్టిస్తున్నారు. ఎవరూ పట్టించుకోపోయినా, గుర్తించకపోయినా, పిడికెడు సాయం చేయకపోయినా తన బతుకుభారాన్ని తామే మోస్తూ ఆత్మగౌరవంతో సగర్వంగా నిలబడుతున్నారు. గాయపడిన తండ్రిని సైకిల్ పై కూర్చోబెట్టుకుని ఓ బాలిక ఏకంగా 1200 కి.మీ తొక్కి సురక్షితంగా స్వగ్రామానికి చేరుకుంది. 

బిహార్‌లోని దర్భంగాకు చెందిన మోహన్ పాశ్వాన్ ఢిల్లీల కూలినాలి చేసుకుంటున్నాడు. రిక్షాను కిరాయికి తీసుకుని తొక్కేవాడు. లాక్ డౌన్ వల్ల పనిలేక కిరాయి కట్టలేకపోయాడు. దీంతో రిక్షా యజమాన్ని దాన్ని లాక్కుపోయాడు. ఇంటి కిరాయి కూడా చెల్లించకపోవడంతో యజమాని బెదిరింపులకు దిగాడు. ఇది చాలదన్నట్లు రోడ్డు ప్రమాదంతో గాయపడ్డాడు. దీంతో చేసేదేమీ లేక సొంతూరు వెళ్దామనుకున్నాడు. చేతిలో వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్నాయి. రూ. 500లకు పాత సైకిల్ కొన్నాడు. తొక్కే శక్తి లేకపోవడంతో కూతురు జ్యోతి కుమారి ముందుకొచ్చింది. తండ్రిని సైకిల్ పై కూర్చోబెట్టుకుని తొక్కింది. ఈ నెల 10న ఢిల్లీలోని గురుగ్రామ్ నుంచి మహాప్రయాణం మొదలైంది. దారిలో అష్టకష్టాలు పడుతూ నిన్న దర్భంగా చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు ఇద్దరికీ కరోనా టెస్ట్ చేయగా, నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. ఇద్దర్నీ హోం క్వారంటైన్‌లో ఉంచారు. 

‘నేనేం భయపడలేదు. కాకపోతే వెనక నుంచి ఏవైనా వాహనాలు ఢీకొడతాయని భయడ్డాను. రాత్రిపూట పెట్రోల్ బంకుల్లో నిద్రిస్తూ వచ్చాం. సహాయ శిబిరాల్లో మాకు ఆహారం అందించారు..’ అని జ్యోతి చెప్పింది.