విమానంలాంటి రైలు...తేజస్.హైలైట్స్ ఇవే... - MicTv.in - Telugu News
mictv telugu

విమానంలాంటి రైలు…తేజస్.హైలైట్స్ ఇవే…

May 23, 2017

భారతీయ రైల్వేలో అత్యంత విలాసవంతమైన రైలు తేజస్. రైల్వే మంత్రి సురేష్ ప్రభు దీన్ని పట్టాలెక్కించారు. ఎనిమిది గంటల్లో ఈ రైలు ముంబై నుంచి గోవా చేరుకుంటోంది. విమానంలా విలాసంగా ఉండే తేజస్ విశేషాలేంటో తెలుసుకోవాలంటే రీడ్ దిస్ స్టోరీ…
ఇప్పటి వరకు భారతీయ రైల్వేలో వచ్చిన అన్ని రైళ్ల కన్నా తేజస్ విలాసవంతమైంది. ఇందులో ఆటోమేటిక్ డోర్స్, ఎల్‌సీడీ తెరలు, వైఫై, టీ, కాఫీ మెషిన్లు, మేగజైన్స్, బయో టాయిలెట్స్, హ్యాండ్ డ్రయర్స్ లాంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ఈ రైలు గంటకు గరిష్టంగా 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ముంబై నుంచి గోవా వరకు మొత్తం 579 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. అందుకు గాను ఈ రైలుకు దాదాపుగా 8 గంటల సమయం పడుతుంది. త్వరలో ఢిల్లీ-చండీగడ్, ఢిల్లీ-లక్నో మార్గాల్లో కూడా ఇలాంటి రైళ్లను నడపనున్నారు.
తేజస్ రైలులో ముంబై నుంచి గోవా వరకు రూ.2,525 చార్జీ. ఫుడ్ కావాలనుకుంటే రూ.2,680 వరకు ఒకరికి ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు ఈ చార్జి ఉంటుంది. అదే చెయిర్ కార్‌లో వెళితే రూ.1,155 వరకు ఒకరికి చార్జి చేస్తారు. ఫుడ్ కావాలనుకుంటే వీరు రూ.1,280 చెల్లించాల్సి ఉంటుంది.
తేజస్ కోచ్‌లు పూర్తిగా గ్రాఫిటీ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ టెక్నాలజీలతో తయారయ్యాయి. అంటే ఈ రైలు పెట్టెలపై దేంతో రాసినా గీతలు పడవు. అదేవిధంగా దుమ్ము, ధూళి కూడా అంటుకోదు. తేజ‌స్ రైలులో సీట్ల‌ను అత్యంత అధునాత‌న డిజైన్‌తో త‌యారు చేశారు. వాటిలో కూర్చుంటే రైలు ఎంత వేగంతో వెళ్తున్నా కుదుపులు ఉండ‌వు. తేజస్ రైలును సీజన్‌లో వారానికి 5 రోజులు, అన్‌సీజన్‌లో వారానికి 3 రోజులే నడుస్తుంది.
ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఉన్న 20 కోచ్‌లు ఈ ట్రెయిన్‌లో ఉన్నాయి. చెయిర్ కార్ ఉన్న కోచ్‌లు 12 ఉన్నాయి. మొత్తం 32 బోగీలను ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ఒక్కో బోగీకి 56 మంది ప్రయాణించేందుకు అవకాశం ఉంది. అదే చెయిర్ కార్‌లో అయితే 78 మంది వరకు ప్రయాణించవచ్చు.
తేజస్ రైలును దాదాపుగా అన్ని రకాల భద్రతా ప్రమాణాలు కలిగి ఉండేలా తయారు చేశారు. ఇందులో అగ్ని ప్రమాదాలను పసిగట్టే స్మోక్ డిటెక్షన్, ఫైర్ డిటెక్షన్ టెక్నాలజీలున్నాయి. దీంతో ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేసి ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రైలులో ప్రయాణికుల సీట్ల వెనుక ఏర్పాటు చేసిన ఎల్‌సీడీ తెరలపై జీపీఎస్ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే అవుతుంది. దీంతో రైలు ఎక్కడుందో ప్రయాణికులకు సులభంగా తెలుస్తుంది. దివ్యాంగుల కోసం బ్రెయిలీ లిపిలో కూడా ఇందులో సమాచారాన్ని ఏర్పాటు చేశారు.