Telagana high court quashed ysr congress mp avinash reddy petition regarding cbi arrest
mictv telugu

అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షాక్.. అరెస్ట్ తప్పదా!

March 17, 2023

Telagana high court quashed ysr congress mp avinash reddy petition regarding cbi arrest

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడైన కడప వైకాపీ ఎంపీ అవినాశ్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో అన్ని దారులు మూసుకుపోయాయి. సీబీఐ తనను వేధిస్తోందని, తనను అరెస్ట్‌ చేయకుండా ఆదేశించాలని ఆయన వేసిన మధ్యంతర పిటిషన్‌ను కోర్టు శుక్రవారం కొట్టేసింది. సీబీఐ విచారణకు సహకరించి తీరాల్సిందేనని తేల్చిచెప్పింది. ఇప్పటికే నాలుగుసార్లు సీబీఐ ముందు హాజరైన అవినాశ్ మళ్లీ విచారణకు వెళ్తే అరెస్ట్ తప్పదనే భయంతో కోర్టును ఆశ్రయించడం తెలిసిందే. అవినాశ్, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఈ హత్య కేసులో కీలక నిందితులని, వారిని విచారించాల్సిన అవసరం ఉందని సీబీఐ కోర్టుకు నివేదించింది. వారు విచారణకు సహకరించడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. సీబీఐ వాదనలను, అవినాశ్ వాదనలు విన్న కోర్టు అరెస్ట్‌ను తాము అడ్డుకోలేమని, దర్యాప్తు యథావిధిగా కొనసాగాలని స్పష్టం చేసింది.

సీఎం ఢిల్లీ టూర్..
ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్ శుక్రవారం మోదీని కలవనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. అవినాశ్ అరెస్ట్‌ను అడ్డుకోవడానికే జగన్ ఢిల్లీ టూర్ వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ కోరినట్లు తెలుస్తోంది. సీబీఐ దూకుడు పెంచడంతో అవినాశ్‌ను కాపాడుకోవడానికే సీఎం హస్తిన వెళ్లారని కథనాలు వస్తున్నాయి. ఈ కేసును సీబీఐ తప్పుదోవ పట్టిస్తోందని అవినాశ్ ఆరోపిస్తుండడం తెలిసిందే. వివేకాను తాము చంపలేదని ఆయన అంటున్నారు. వివేకా ఓ ముస్లిం మహిళను పెళ్లి చేసుకోవడతో ఆస్తి దక్కదనే అనుమానంతో ఆయన అల్లుడు రాజశేఖరే చంపించాడని చెబుతున్నారు. అయితే అవినాశ్ రెడ్డి, ఇతర నిందితులే ఈ హత్యకు పాల్పడ్డారని, అందుకు కీలకమైన ఆధారాలు ఉన్నాయని సీబీఐ అంటోంది. తొలుత ఈ హత్య వెనక టీడీపీ హస్తం ఉందని ఆరోపించి వైకాపా నేతలు తర్వాత ఇంటిగొడవ కోణాన్ని తీసుకురావడంతో అసలే ఈ కేసును ఎవరు పక్కదారి పట్టిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజశేఖర్ రెడ్డే చంపించి ఉంటే అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం ఇన్నేళ్లుగా చూస్తూ ఉరుకుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.