బెబ్బులి లా పంజా విసిరి దెబ్బ కొట్టాలి : కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

బెబ్బులి లా పంజా విసిరి దెబ్బ కొట్టాలి : కేసీఆర్

December 4, 2022

తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటించిన ఆయన సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ” మహబూబ్‌నగర్‌ జిల్లాలో పరిపాలన భవం ప్రారంభించుకోవడం సంతోషకరంగా ఉంది. పరిపాలనా సంస్కరణలో భాగంగా కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. నేను పాలమూరు ఎంపీగా ఉండగా తెలంగాణ సాధించుకున్నాం. మిషన్ కాకతీయలో చెరువులన్నీ బాగు చేసుకున్నాం. ఆనాడు బొంబాయికి వలస పోతుంటే కన్నీలు వచ్చాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. ఎక్కడ చూసినా పచ్చని పంటలు కనిపిస్తున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం సహకరించడం లేదు. కృష్ణా జలాల్లో మన వాటాను కేంద్రం తేల్చడం లేదు. సంక్షేమంలో మనకెవరు సాటి, పోటీ లేరు .ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ ఫలితాలు ఇప్పుడు మన ముందున్నాయి. 25 లక్షల ఎకరాల్లో పాలమూరులో పచ్చన పంటలు పండే రోజు రాబోతుంది. మహబూబ్ నగర్‎కు పరిశ్రమలు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. మంచినీరు, కరెంట్ కొరత తీరింది. కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ప్రజలు తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. ఇవాళ రైతు ఏ కారణంతో చనిపోయిన వెంటనే రూ.5 లక్షలు ఇస్తున్నాం” అని కేసీఆర్ వెల్లడించారు.

కేంద్రం పై కేసీఆర్ ఆగ్రహం

” మనతో సమానంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుంది. చేతకాని కేంద్ర ప్రభుత్వం వల్ల తెలంగాణ రూ.3 లక్షల కోట్లు నష్టపోయింది. రాష్ట్రానికి వచ్చి మోడీ డంబాచారాలు చెబుతున్నారు. కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదు. కాళ్లలో కట్టెలు పెడతం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. మేం చేయం వాళ్లను చేయనివ్వం అన్న విధంగా కేంద్రం తీరు ఉంది. దేశంలో ఏం జరుగుతుందో యువకులు, మేధావులు ఆలోచించాలి. దీనిపై గ్రామాల్లో చర్చపెట్టాలి. మనలాంటి మంచనీటి పథకం ఏ రాష్ట్రంలో లేదు.ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‎లో కూడా తాగడానికి నీళ్లేవు, అక్కడ 24 గంటలు కరెంట్ లేదు. దేశ రాజధాని ఢిల్లీలో కరెంట్ కోతలు ఉన్నాయ. తాగడానికి వాటర్ కూడా లేవు. రోజు ట్యాంకర్లు కొంటామని మా మిత్రులు చెప్తారు. భారత సమాజం యొక్క జీవనాడి ఈనాడు కలుషితం చేయబడుతుంది.ప్రజల మధ్య చీలికలు తెచ్చి..విద్వేషాలు, భావోధ్వేగాలు రెచ్చగొడుతున్నారు. మంచి నాయకులను ఇబ్బంది పెడుతున్నారు. ప్రతిపక్షాల నేతల మీద దాడులు చేయించి ఇబ్బంది పెడుతున్నారు. అక్రమాలపై దేశంలో ఎక్కడ నుంచో ఒక దగ్గర నుంచి తిరుగు బాటురావాలి. బెబ్బులి లా పంజా విసిరి దెబ్బ కొట్టాలి. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చీల్చేందుకు హైదరాబాద్‌కు దొంగలు వస్తే దొరకబట్టి జైల్లో వేశాం” అని కేసీఆర్ పేర్కొన్నారు.