భారత ప్రధాని మోదీకి అదానీ మిత్రుడు కాబట్టే అతడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. నాందేడ్ లో బీఆర్ఎస్ సభ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మరోసారి బీజేపీని టార్గెట్ చేశారు. అదానీ స్కామ్ పై జేపీసీ ఎందుకు వేయడంలేదని ప్రశ్నించారు.? “అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ నుంచి రూ.87 వేల కోట్ల పెట్టుబడులు పెట్టించారు. అదానీ ఎఫెక్ట్ తో ప్రజల సొమ్ము రూ.10 లక్షల కోట్లు ఆవిరైంది. అదానీ మిత్రుడు కాబట్టే అతడ్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్ఐసీకి ఎలాంటి నష్టం జరగలేదని కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది. రెండు సంవత్సరాలలో అదాని ఎదగడం ఎలా సాధ్యమైంది..?సాధారణ వ్యాపారికి ఇది సాధ్యమవుతుందా?” అంటూ కేసీఆర్ కేంద్రంపై విమర్శలు వర్ష కురిపించారు. అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌లో సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లో కరెంటు పోదు..
దేశంలో 360 టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, మన దేశంలో బొగ్గు నిల్వలతో 125 సంవత్సరాల పాటు దేశమంతా విద్యుత్ ఇవ్వొచ్చన్నారు కేసీఆర్. విదేశాల నుంచి బొగ్గు దిగుమతి వెనుక ఉన్న మతలబు ఏంటని ప్రశ్నించారు. విద్యుత్ రంగంలో ప్రైవేట్ సంస్థలను ఎందుకు ప్రోత్సాహిస్తున్నారని కేంద్రాన్ని నిలదీశారు. దేశంలో 24 గంటలు కరెంటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ, 24 గంటలు అన్ని వర్గాలకు విద్యుత్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. న్యూయార్క్, లండన్‌లో కరెంటు పోవచ్చు గానీ హైదరాబాద్‌లో పోదన్నారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్
మహిళల ప్రాతినిధ్యం ఉన్న సమాజం అద్భుతంగా ప్రగతి సాధిస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.మహిళలను కేంద్రం చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. భారత్ రాష్ట్ర సమితి(brs) అధికారంలోకి రాగానే చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజ్వేషన్లు అమలు చేస్తామని తెలిపారు. ఆ హామీని ఏడాదిలోపే జరుగుతుందని హామీ ఇచ్చారు.