Telanagana health director srinivas touches kcr feet
mictv telugu

కేసీఆర్ కాళ్ల మీద పడ్డ తెలంగాణ హెల్త్ డైరెక్టర్..

November 16, 2022

రాజకీయనాయకుల మొప్పు పొందేందుకు ఈ మధ్య ఉన్నతాధికారులు దిగజారిపోతున్నారు. తమ స్థాయిని మరిచి కాళ్లుమీద పడుతున్నారు. తాజాగా తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తీరు చర్చనీయాంశమైంది. ఆయన వంగి వంగి సీఎం కేసీఆర్ కాళ్లకు మొక్కడం హాట్ టాపికైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఎం కాళ్లకు ఆయన నమస్కరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా ఉండి ఇలాంటి పనులేంటని ప్రశ్నలు వస్తున్నాయి.

మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేసి ఫైర్ అయ్యారు. ‘కొత్తగూడెం అసెంబ్లీ టీఆర్ఎస్ టికెట్ గురించే కదా డాక్టర్ శ్రీనివాస్ సీఎం కాళ్లు పట్టుకోవడం. మీలాంటి అధికారులు బ్యూరోక్రసీ పరువు తీస్తున్నారు. మొన్న కొత్తగూడెం వెళ్ళినప్పుడు చూసా టౌన్ నిండా మీ ఫ్లెక్సీలే. పదవిని దుర్వినియోగం చేస్తూ కొత్తగూడెంలో ఏదో కార్యక్రమాలు చేస్తున్నారని కొందరు నాతో అన్నారు’ అంటూ ఆకునూరి మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో కూడా కొంతమంది అధికారులు కేసీఆర్ కాళ్లు మొక్కిన సందర్భాలు ఉన్నాయి. సిద్దిపేటలో నూతన కలెక్టరేట్​ ప్రారంభోత్సవం సందర్భంగా అప్పటి కలెక్టర్ వెంకటరామిరెడ్డి సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కారు. తర్వాత ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది. అప్పట్లో ఈ విషయంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.