తెలంగాణలో అమ్ముడు కొనుడు రాజకీయాలు సాధ్యమేనా? - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో అమ్ముడు కొనుడు రాజకీయాలు సాధ్యమేనా?

March 7, 2018

త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయంతో దేశంలో కొత్త చర్చ మొదలైంది. కాషాయదళం ఇక అన్ని రాష్ట్రాల్లోనూ జెండా ఎగరేస్తుందని, పక్కా వ్యూహాలు అమలు పరచి శత్రుపక్షాలను మట్టికరిపిస్తుందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక తమ తర్వాత టార్గెట్ పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఒడిశా అని పార్టీ చీఫ్ అమిత్ షా ప్రకటించడం తెలిసిందే. తెలంగాణ, ఏపీ, కేరళ పేర్లను ఆయన ప్రస్తావించకపోవడం గమనార్హం. ప్రస్తావించకపోయినా తెలంగాణలో గెలుపుకోసం, అది సాధ్యం కాకపోతే రెండో స్థానం కోసం షా పకడ్బందీగా వ్యూహాలు పన్నుతూనే ఉన్నారు.

ఇతర పార్టీల నుంచి ఆకర్షణ్..

త్రిపురతోపాటు, సమీప గతంలో అస్సాం, అరుణాచల్ తదితర ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసింది. అక్కడి పార్టీల్లోని అసంతృప్త నేతలను తనవైపు లాక్కుని బలాబలాలను తారుమారు చేసి అధికారంలోకి వచ్చింది. త్రిపురలోనూ అదే వ్యూహాన్ని అమలు చేసింది. కాంగ్రెస్, తృణమూల్ తదితర స్థానిక పార్టీ నేతలను సామ దాన భేద దండోపాయాలతో తనవైపు తిప్పుకుంది. ఇందుకోసం కోట్ల రూపాయలను వెదజల్లారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. బీజేపీ, సంఘ్ కార్యకర్తలను క్షేత్రస్థాయికి పంపించి, కమ్యూనిస్టుల మూలాలు తీవ్రంగా దెబ్బకొట్టారు. అమిత్ షా ఇదే వ్యూహాన్ని తెలంగాణలో అనుసరిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

స్పెషల్ టీములు, హోల్ టైమర్లు..

పార్టీ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి అమిత్ షా స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దించారు. వాటి ద్వారా వాస్తవ పరిస్థితులను, గెలుపు అవకాశాలపై నివేదికలను తెప్పించుకుంటున్నారు. ఈశాన్య రాష్రాల్లో పార్టీ విజయానికి కష్టపడిన టీమ్‌లు కూడా త్వరలో తెలంగాణలో తిరగనున్నాయి.  వీటికి కేంద్ర మంత్రుల బృందం కూడా తోడుకానుంది. తెలంగాణలో ఎవరితోనూ పొత్తుపెట్టుకోకుండానే, సొంతంగా అధికారంలోకి వచ్చేందుకు చేయాల్సిందల్లా చేస్తామని అమిత్ షా కేడర్‌ను భజం తట్టి ప్రోత్సహిస్తున్నారు. ‘మీరు చేయాల్సిందంతా చేయండి.. ఫలితాన్ని నాకు వదిలేయండి..’ అని ఆయన రాష్ట్ర పార్టీ నేతలకు చెబుతున్నారు.

ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లి, ఓట్లు కైవసం చేసుకోవడం అమిత్ షా వ్యూహం. దీనికోసం ఆయన తెలంగాణలో పెద్ద సంఖ్యలో హోల్ టైమర్లను నియమించినట్లు తెలుస్తోంది. ఒక్కో కార్యకర్తకు బూత్‌ల వారీగా 70 మంది ఓటర్లకు చేరువై, వారికి పార్టీ సిద్ధాంతాలను వివరించి, వారి ఓట్లను బీజేపీ వేయించే బాధ్యతను కట్టబెడుతున్నారు. మరోపక్క.. టీడీపీ, కాంగ్రెస్ తదితర పార్టీల్లోని అసంతృప్త నేతలకు గాలం వేస్తున్నారు. టీజాక్ నేత కోదండరాంతోనూ తెరచాటు మంతనాలు సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా బహుముఖ వ్యూహంతో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, అది సాధ్యం కాకపోతే కనీసం రెండో అతిపెద్దగా పార్టీగా అవతరించేందుకైనా యత్నించాలని కాషాయదళ అధిష్టానం కేడర్‌ను ప్రోత్సహిస్తోంది.

నిజానికి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ వ్యూహాన్ని అమలుపరచాలనుకుంది బీజేపీ. అయితే అక్కడ ప్రత్యేక హోదా ఉద్యమం కొనసాగుతుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చంద్రబాబును వదిలేసి జగన్, లేకపోతే పవన్ కల్యాణ్‌లతో చేతులు కలిపి అధికారంలోకి రావాలని కమల నాథులు యత్నిస్తున్నారు. అయితే అక్కడ పరిస్థితి హోదా చుట్టూ తిరగడం, మోదీ సర్కారు ఆ డిమాండ్‌ను నెరవేర్చడానికి జంకుతుండడంతో ఫోకస్ తెలంగాణకు మారింది.

వ్యూహాలు సరే, అమలు ఎలా?

త్రిపుర వ్యూహాన్ని తెలంగాణలో అమలు పరచడం ఇప్పట్లో అసాధ్యం. త్రిపురతో పోలిస్తే తెలంగాణ చాలా భిన్నం. జనాభా, భావజాలాలు, కేడర్, నాయకత్వం వంటి అన్నో అంశాల మధ్య రెండు రాష్ట్రాలకు పోలికలే లేవు. త్రిపురతో పోలిస్తే తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకత తక్కువే. త్రిపుర ప్రజలు పాతికేళ్ల ‘ఎర్ర’పాలనపై రోసిపోయి ‘కాషాయం’వైపు మళ్లారు. తెలంగాణలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. టీఆర్ఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నవారు సైతం.. ‘కొత్త రాష్ట్రం కదా, అన్నీ సజావుగా ఎలాసాగుతాయి? కేసీఆర్‌కు కొంత సమయం కావాలి’ అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను తీవ్రంగా ప్రచారం చేయడం సాధ్యం కాదు.

హిందుత్వ భావన ఆకట్టుకుంటుందా?

బీజేపీ జాతీయ పార్టీ కనుక అది అతివాద జాతీయ వాదం, హిందుత్వ సిద్ధాంతాలపై రాష్ట్ర ప్రజలు ఆసక్తి చూపే అవకాశం తక్కువ. తమిళనాడు, కేరళ, ఏపీ తదితర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండడం, మతతత్వ ధోరణులు లేకపోవడం, బీజేపీ ఉత్తరాది పార్టీ అనే భావన, నోట్ల రద్దు, జీఎస్టీ మోత వంటి మరెన్నో అంశాలు తెలంగాణ ప్రజలను బీజేపీకి దూరంగా ఉంచే అవకాశముంది. ఉత్తరాదిలోని యోగి ఆదిత్యనాథ్(యూపీ), సర్వానంద సోనోవాల్(అస్సాం), వసుంధర రాజే(రాజస్థాన్), పారికర్ వంటి సత్తా ఉన్న నేతలు తెలంగాణ బీజేపీలో లేకపోవడం పెద్ద లోపం. వీరు సీఎంలు కాకముందు కూడా ప్రజల్లో పలుకుబడి ఉన్నావారే  

ఆ పార్టీల నేతలు వస్తారా?

ఆయారాం గయారాం వ్యూహం కూడా తెలంగాణాలో పనిచేసే చాన్స్ లేదు. టీఆర్ఎస్‌ను బలంగా విమర్శిస్తున్న కాంగ్రెస్, టీడీపీ నేతలు బీజేపీవైపు మొగ్గుచూపడం లేదు. అంతగా అయితే టీఆర్ఎస్‌లోనే చేరిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. టీడీపీలోని అసంతృప్త నేతలు కూడా కాంగ్రెస్, టీఆర్ఎస్‌లవైపే మొగ్గుచూపుతున్నారు. బీజేపీకి అధిష్టానం నుంచి ధనబలం, వ్యూహబలం ఉన్నా రాష్ట్రంలో బలమైన, క్షేత్రస్థాయి శ్రేణులు లేకపోవడం పెద్ద లోటు.

పైగా ఎన్నికలు కూడా త్వరలోనే ఉండడం మరో ప్రతికూల అంశం. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ మరో అడ్డంకి. ఇవన్నీ బీజేపీ వ్యూహాలపై ప్రభావం చూపుతాయి. తెలంగాణతోపాటు, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఒక భాగం ప్రజలకు బీజేపీ వల్లించే ‘అఖండ భారతం’ భావన కంటే ‘తెలంగాణ గడ్డ, నీళ్లు, ప్రత్యేక హోదా,  ద్రవిడ ఉద్యమం, హిందీ వ్యతిరేకత, హేతువాదం, అక్షరాస్యత, సంక్షేమం..’ వంటి అంశాలపైనే ఆసక్తి, అనురాగం. కనుక బీజేపీ ఇప్పట్లో తన భావజాలం, ధనబలం, కండబలంతో ఎంత పోరాడినా ఫలితాలు నిరాశ కలిగించక మానవు..! కానీ ప్రయత్న లోపం ఉండొద్దన్నది బీజేపీ సిద్ధాంతం. దాని ప్రకారం అది తన పనితాను చేసుకుంటూ పోతుంది. తీర్పు చెప్పాల్సింది ప్రజలే..!