రక్త హోళీ.. తెలంగాణ వచ్చాక భారీ ఎన్‌కౌంటర్ ఇదే.. - MicTv.in - Telugu News
mictv telugu

రక్త హోళీ.. తెలంగాణ వచ్చాక భారీ ఎన్‌కౌంటర్ ఇదే..

March 2, 2018

ఒకవైపు తెలంగాణ అంతటా రంగుల హోళీ సంబరాలు మిన్నంటుతున్నాయి. మరోవైపు సరిహద్దులో రక్త హోళీ జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూగూరు వెంకటాపురం తడపలగుట్ట వద్ద శుక్రవారం వేకువజామున తుపాకులు గర్జించాయి. ఆరుగురు మహిళా మావోయిస్టులు సహా మొత్తం 10 మంది మావోయిస్టులు, ఒక గ్రేహౌండ్ కానిస్టేబుల్ మృతిచెందారు. కాల్పులు, కూంబింగ్ ఇంకా కొసాగుతోంది.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక రాష్ట్రంలో జరిగిన తొలి భారీ ఎన్‌కౌంటర్ ఇదే. గత ఏడాది డిసెంబర్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్లో చండ్రపుల్లారెడ్డి బాట వర్గానికి చెందిన 8 మంది నక్సల్స్ చనిపోయారు. అప్పటికి రాష్ట్రంలో అదే భారీ ఎన్ కౌంటర్. అంతకుముందు వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలో జరిగిన ఎన్‌కౌంటర్ సంచలనం సృష్టించింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రుతి, సాగర్ అనే విద్యార్థులను పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

కేడర్ తగ్గింది.. ఉన్నవాళ్లంతా అగ్రనేతలే..

ఉమ్మడి రాష్ట్రంలో మావోయిస్టులకు చాలా గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక పార్టీ ఉనికి నామమాత్రంగానే ఉంది. ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో కేడర్ బాగా తగ్గిపోయింది. రాష్ట్ర కమిటీకి ప్రస్తుతం జగన్ సారథ్యం వహిస్తున్నారు. తాజా ఎన్‌కౌంటర్లో చనిపోయిన వాళ్లందరూ రాష్ట్ర కమిటీ నేతలేనని పోలీసులు వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. ఇదే నిజమైతే రాష్ట్రంలోని అగ్రనాయకత్వమంతా తుడిచిపెట్టుకుపోయినట్లేనని భావించాలి.

పోలీసుల పైచేయి

తెలంగాణ రాష్ట్రం వచ్చాక జరిగిన ఎన్‌కౌంటర్లలో పొరుగు రాష్ట్రాలు, కేంద్ర బలగాలు కూడా పాల్గొన్నాయి. ఛత్తీస్, మహారాష్ట్ర, ఒడిశాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో తెలంగాణ పోలీసులూ పాల్గొన్నారు. మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించాలని కంకణం కట్టుకున్న కేంద్రం.. అందుకు కావాలసిన నిధులు, ఆయుధాలతోపాటు, ఇష్టారాజ్యంగా వ్యవహరించే స్వేచ్ఛనూ రాష్ట్రాలకు ప్రసాదించింది. దీంతో పోలీసులు ఇన్‌ఫార్మర్ వ్యవస్థలను పటిష్టం చేసుకున్నారు. ఇన్ ఫార్మర్లు ఇచ్చిన సమాచారంతో, భారీ బలగాలతో కూంబింగ్ చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల పోలీసులతో ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ మావోయిస్టుల ఆనుపానుల పసిగట్టి దాడులు చేస్తున్నారు. చాలా సందర్భాల్లో ఏకపక్ష దాడులే సాగుతున్నాయి. ఉద్యమాకారులను పట్టుకొచ్చి చిత్రహింసలు పెట్టి, కాల్చి చంపారని తమ నిజనిర్ధారణల్లో తేలిందని హక్కుల సంఘాలు చెబుతున్నాయి. మృతదేహాలను చూస్తే ఈ ఆరోపణ నిజమేననిపిస్తుంది. ఒళ్లంతా తూటాల గాయలు, కత్తులతో కోసిన ఆనవాళ్లు మృతదేహాలపై ఉన్నాయి. ఈ ఎన్‌కౌంటర్ల  మృతుల్లో అత్యధికం  మావోయిస్టులే ఉండడం, పోలీసులు లేకపోవడం, ఉన్నా పది మంది నక్సల్స్ చనిపోతే, ఒక పోలీసు చనిపోవడమో, గాయపడ్డమో జరగుతుండడం వల్ల  ఇవి పకడ్బందీగా పోలీసులే చేస్తున్న ఎన్ కౌంటర్లని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.