కొలువుల కొట్లాట.. షురూ కాకముందే ఉద్రిక్తత - MicTv.in - Telugu News
mictv telugu

కొలువుల కొట్లాట.. షురూ కాకముందే ఉద్రిక్తత

December 4, 2017

టీజేఏసీ ఈ రోజు మధ్యాహ్నం నిర్వహించునున్న కొలువుల కొట్లాట సభ.. మొదలు కాకముందే ఉద్రిక్తతకు దారితీసింది. ఎక్కడికక్కడ ఉద్యమకారులను పోలీసులు అడ్డుకుంటున్నారు. అరెస్ట్ చేసి జైళ్లలో పెడుతున్నారు. సూర్యాపేట జిల్లా, రంగారెడ్డి, కరీంనగర్ తదితర జిల్లాల నుంచి హైదరాబాద్‌కు రాకుండా తనిఖీలు చేస్తున్నారు. ఈ అరెస్టుల పర్వంపై టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల నుంచి, హైకోర్టు నుంచి  అనుమతి తీసుకునే సభ నిర్వహిస్తున్నామని, ఇలా భయపెట్టడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మండిపడుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.ఆ ప్రకటన ఇదీ..

‘తెలంగాణ వ్యాప్తంగా టీజేఏసీ నాయకులను, విద్యార్థి నాయకులను అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులు అరెస్టు చేశారు. కొలువులకై కొట్లాట సభకు కోర్టు ఆదేశాలు, పోలీసు అధికారిక అనుమతి ఉన్న తరువాత కూడా అక్రమ నిర్బంధాలను టీజేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది. తక్షణం అరెస్టుచేసిన అందరినీ విడుదల చేయాలని టీజేఏసీ డిమాండ్ చేస్తున్నది.

మరోవైపు ఓయూ హాస్టళ్లపై పోలీసులు అర్ధరాత్రి దాడిచేసి విద్యార్థుల, పత్రికా విలేకరులను అమానుషంగా లాఠీలతో కొట్టారు. లాఠీచార్జ్ లో అనేకమంది విద్యార్థులు గాయపడ్డారు. చాలామంది విద్యార్థులను అరెస్టు చేశారు. విద్యార్థులపై, విలేకరులపై లాఠీఛార్జీని,అరెస్టులను టీజేఏసీ తీవ్రంగా ఖండిస్తుంది.అరెస్టు చేసిన విద్యార్థులను తక్షణం విడుదలచేయాలి టీజేఏసీ డిమాండ్ చేస్తున్నది.

ఈ రోజు కొలువులకై కొట్లాట సభ యధాతధంగా జరుగుతుంది. సభకు పెద్దఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాల్సిందిగా తెలంగాణ యువతకు, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.

ప్రొ. కోదండరాం,చైర్మన్

టీజేఏసీ’