Telangana: 300 families left the village..this is the reason
mictv telugu

ఊరు వదిలిన 300 కుటుంబాలు..కారణం ఇదే

September 15, 2022

దేశవ్యాప్తంగా రోజు రోజుకు టెక్నాలజీ అభివృద్ది చెందుతున్నప్పటికి కొన్ని సంఘటనలను విన్నప్పుడల్లా, కళ్లతో చూసినప్పుడల్లా ఇది నిజమేనా, ఈ రోజుల్లో కూడా ఇలాంటివాళ్లు ఉన్నారా? అనే ఆలోచన కల్గుతుంది. ముఖ్యంగా మూఢనమ్మకాల విషయానికొస్తే, దేశంలో ఇప్పటికే పలు ఆశ్చర్యకరమైన సంఘటనలు సోషల్ మీడియలో వైరల్ అయ్యాయి.

తాజాగా మరో సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఊరికి కీడు సోకిందని ఏకంగా 300 కుటుంబాలు ఊరిని విడిచి, పంట పొలాల్లో వంటవార్పు చేసుకుంటున్నారు. ఇది మనకు వింతగా అనిపించినా, ఆ ఊరి వాళ్లకి మాత్రం ఈ ఆచారం ఖచ్చితంగా పాటించి తీరాల్సిందేనని అంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని రామన్నపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయమే గ్రామస్థులంతా తమ నివాసాలు విడిచి, పంట పొలాలు, పలు ప్రాంతాలకు వెళ్లి అక్కడే వంటలు చేసుకున్నారు. ఇందుకు ప్రధాన కారణం…గ్రామంలో నెల వ్యవధిలోనే ముగ్గురు మృతి చెందారు. దాంతో తమ గ్రామానికి ఏదో కీడు సోకిందని భావిస్తూ, సుమారు 300 కుటుంబాలు సాయంత్రం వరకు గ్రామాన్ని వదిలి పంట పొలాల్లోనే ఉండాలని నిశ్చయించుకున్నారట. వేద పండితుల సూచన మేరకు, గ్రామాన్ని విడిచి వచ్చినట్లు పలువురు గ్రామస్తులు తెలియజేశారు. అంతా బయటకు రావడంతో ప్రస్తుతం ఆ గ్రామం ఖాళీగా దర్శనమిస్తోంది.