Telangana: 33 Gurukuls started from October 11
mictv telugu

గుడ్‌న్యూస్: అక్టోబర్ 11 నుంచి గురుకులాలు ప్రారంభం

September 2, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో అక్టోబర్ 11 నుంచి 33 బీసీ గురుకులాలు ప్రారంభంకానున్నాయని కాసేపటిక్రితమే బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలియజేశారు. బీసీ గురుకులాల ప్రారంభంపై నేడు ఆయన అధికారులతో సమావేశం అయ్యారు. సమావేశంలో భాగంగా ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 33 నూతన గురుకులాలు అక్టోబర్ 11 నుంచి, నూతన డిగ్రీ కళాశాలలను అక్టోబర్ 15 నుంచి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

గంగుల కమలాకర్ మాట్లాడుతూ..”అత్యున్నత స్థాయి ప్రమాణాలతో వీటిని నెలకొల్పం. స్థలాల గుర్తింపు బాధ్యతను స్థానిక జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు సమన్వయం చేశాం. గతంలో కేసీఆర్ నిచ్చిన హామీ ప్రకారం హాలియా, దేవరకద్ర, కరీంనగర్, సిరిసిల్ల, వనపర్తితోపాటు పాత జిల్లాల ప్రతిపాదికగా ప్రతి జిల్లాలో డిగ్రీ కాలేజీలను ప్రారంభిస్తున్నాం. ఈ నూతన గురుకులాలతో మొత్తం బీసీ గురుకులాల సంఖ్య 310కి చేరింది. ఇప్పటికే 41 కులసంఘాలకు 95.25కోట్లు, కోకాపేట, ఉప్పల్ బగాయత్‌లో వేల కోట్ల విలువైన 87.3 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. వీటిలో 24 కుల సంఘాలు ఇప్పటికే ఏకగ్రీవమై పట్టాలు పొందాయి. మిగతా సంఘాల్లో సైతం ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. ఇలా ఏకసంఘంగా ఏర్పడి ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకునే వారికి ఈ నెల 8న పట్టాలను ప్రధానం చేసేలా ఏర్పాట్లు చేస్తాం” అని ఆయన అన్నారు.

అంతేకాకుండా, తెలంగాణలో భర్తీ కానున్న 80,025 ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల కోసం తెలంగాణ బీసీ స్టడీ సర్కిళ్లు మరింత విస్తృతంగా సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 12 స్టడీ సర్కిళ్లకు అదనంగా అతి త్వరలో మరో 50 స్టడీ సెంటర్లను ఏర్పాటు చేసి, గ్రూప్స్, డీఎస్సీ, తదితర పోటీ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ అందించాలన్నారు. వీటి ద్వారా దాదాపు 25వేల మందికి పైగా నేరుగా లబ్దీ చేకూరుతుందన్నారు.