తెలంగాణ: మరో 33 గురుకులాలు, 15 డిగ్రీ కాలేజీలు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ: మరో 33 గురుకులాలు, 15 డిగ్రీ కాలేజీలు

July 7, 2022

తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం గురుకులాల విషయంలో డిగ్రీ కాలేజీల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుందని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ప్రతి సంవత్సరం బీసీ విద్యార్థుల కోసం కొత్తగా 33 గురుకులాలు, మరో 15 డిగ్రీ కాలేజీల సంఖ్యను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. కొత్త గురుకులాల ఏర్పాటు, అప్‌గ్రేడేషన్‌ తదితర అంశాలపై బుధవారం గంగుల కమలాకర్ తన చాంబర్‌లో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

అనంతరం గంగుల మాట్లాడుతూ..”ప్రతి జిల్లాలో ఒక గురుకుల పాఠశాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 33 జిల్లాల్లో 33 కొత్త స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోబోతున్నాం. ఈ ఏడాది కొత్తగా 4 గురుకుల పాఠశాలలను జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. ఇందుకు సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేశాం. వచ్చే ఏడాది మరో 115 స్కూళ్లను జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేయనున్నాం. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఒక డిగ్రీ కాలేజీ మాత్రమే ఉంది. మరో 15 డిగ్రీ కాలేజీలను ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేస్తున్నాం” అని ఆయన అన్నారు.

డిగ్రీ కాలేజీల్లో ఆరు కోర్సుల్లో మూడు కొత్త వాటిని ప్రవేశపెట్టాలని, మెషిన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డాటాసైన్స్, క్లౌడ్‌ టెక్నాలజీ, సాప్, న్యూట్రిషన్‌ ఫుడ్‌ టెక్నాలజీ, ఫ్యాషన్‌ టెక్నాలజీ, టెక్స్‌ టైల్‌ టెక్నాలజీ, బీబీఏ, బీకాం కంప్యూటర్స్, ఎంపీసీఎస్, ఎంఎస్సీఎస్‌ వంటి కోర్సులను కాలేజీల వారీగా ప్రవేశపెట్టాలని గంగుల అధికారులు సూచించారు. వీటిలో విద్యార్థులు విద్యను అభ్యసించిన వెంటనే గురుకుల సొసైటీ ద్వారానే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు నిర్వహించాలని, కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు.