తెలంగాణ: హైదరాబాద్‌లో 4..ప్రతి జిల్లాలో 4: కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ: హైదరాబాద్‌లో 4..ప్రతి జిల్లాలో 4: కేసీఆర్

July 6, 2022

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ ఓ అద్భుతమైన అవకాశాన్ని కల్పించబోతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ కేంద్రంగా ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, గ్రూప్‌-1 వంటి కేంద్ర, రాష్ట్ర సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగాలకు శిక్షణనిచ్చేందుకు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు ఒక్కొక్కటి చొప్పున నాలుగు ‘ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ స్టడీ సర్కిళ్లు ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌’ను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

తెలంగాణవ్యాప్తంగా స్టడీ సర్కిళ్లు, గురుకుల పాఠశాలల ఉన్నతీకరణ, బలహీనవర్గాలకు ఉపాధి సంబంధిత అంశాలపై ప్రగతిభవన్‌లో మంగళవారం కేసీఆర్‌ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక్కో (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ) వర్గానికి ఒకటి చొప్పున 33 జిల్లాల్లో మొత్తం 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలి. ఈ స్టడీ సర్కిళ్లు నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి రంగాల్లో విజయావకాశాలను సాధించిపెట్టే అస్త్రాలుగా మారాలి. కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో, దేశవ్యాప్తంగా ప్రకటించే ఉద్యోగాలను అందిపుచ్చుకొనే విధంగా యువతను తీర్చిదిద్దాలి. ఒక ప్రతిభావంతమైన స్టడీ సర్కిళ్ ఎలా ఉండాలో విధివిధానాలను అధికారులు రూపొందించాలి. ఇందుకు సమర్థులైన అధికారులను నియమించండి.

అంతేకాదు, ఐటీఐ, పాలిటెక్నిక్‌, ఫార్మా, కెమికల్‌, ఇండస్ట్రీ, డిఫెన్స్‌, రైల్వే, బ్యాంకింగ్‌, నర్సింగ్‌, అగ్రికల్చర్‌ తదితర కోర్సులను పూర్తిచేసుకున్న తెలంగాణ యువతీ యువకులకు దేశవ్యాప్తంగా ఉద్యోగ ఉపాధిని కల్పించే అద్భుతమైన భూమికను స్టడీ సర్కిళ్లు పోషించాలి. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు అనే కోణంలోనే కాకుండా ప్రైవేట్‌ రంగాలలో కూడా ఉపాధిని అందించగలిగే కేంద్రాలుగా మారాలి. శిక్షణ పొందుతున్న అర్హులైన అభ్యర్థులకు స్టడీ సర్కిళ్లలో భోజన వసతులు కూడా ఏర్పాటు చేయాలి” అని ఆయన అన్నారు.

ఇక, గురుకులాల్లో ఇంటర్మీడియట్‌ విద్యకు కూడా ప్రభుత్వమే పునాది వేయాలని కేసీఆర్‌ అన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియట్‌ కోర్సులను ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు. బాలికలకు విద్యను అందిస్తున్న కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో కూడా ఇంటర్మీడియట్‌ విద్యను ప్రవేశపెట్టాలని, ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వినియోగించుకోవాలని కేసీఆర్ సూచించారు.

చివరగా.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గురుకుల డిగ్రీ కళాశాలలకు అదనంగా మరో 15 మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ నిర్ణయించారు. రాబోయే విద్యా సంవత్సరంలో వీటిని 17కు పెంచి, మిగతా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని చెప్పారు. మొత్తంగా జిల్లాకో డిగ్రీ రెసిడెన్షియల్‌ కళాశాల చొప్పున 33 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సీఎస్‌ను ఆదేశించారు.