Telangana: 529 new posts sanctioned..in this department
mictv telugu

తెలంగాణ: కొత్తగా 529 పోస్టులు మంజూరు..ఈ శాఖలోనే

September 9, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల నిరుద్యోగులకు గతకొన్ని నెలలుగా కేసీఆర్ సర్కార్ నోటిఫికేషన్ల పరంగా శుభవార్తలు చెప్తూనే ఉంది. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రకటనలు మీద ప్రకటనలు వెలువరిస్తూనే ఉంది. నోటిఫికేషన్ల కోసం కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తూ, కోచింగ్‌లు, ప్రిపేరేషన్లు మొదలుపెట్టిన అభ్యర్థుల కలను నేరవేర్చేందుకు ఆయా శాఖల అధికారులు కసరత్తులు ముమ్మరం చేశారు.

ఈ క్రమంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు అభ్యర్థులకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. కొత్తగా 529 పోస్టులను మంజూరు చేస్తూ, ఆ శాఖ కమిషనర్ ఎం.హన్మంతరావు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్ 258, సీనియర్ అసిస్టెంట్ 173, సూపరింటెండెంట్ 103 పోస్టులు ఉన్నాయి. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలకు అవసరమైన మేర ఈ పోస్టులు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా జడ్పీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాల వారీగా పోస్టుల వివరాలను వెల్లడించారు.

ఇక, ఇప్పటికే తెలంగాణలో గ్రూప్-1, పోలీసు ఉద్యోగాలు, వైద్యశాఖ ఉద్యోగాలు, విద్యుత్ శాఖ ఉద్యోగాలు, సింగరేణిలోని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వెలువడిన ఆయా శాఖల్లోని ఉద్యోగాలకు ప్రిలిమినరీ పరీక్షలు కూడా జరిగాయి. త్వరలోనే పరీక్షలకు సంబంధించిన ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఈ క్రమంలో పంచాయతీ శాఖలో ఉన్న మరో 529 పోస్టులను మంజూరు చేస్తూ, ఆ శాఖ కమిషనర్ ఎం.హన్మంతరావు ఆదేశాలు జారీ చేశారు.