Telangana: Adjust the VROs..in these departments
mictv telugu

తెలంగాణ: వీఆర్వోలను..ఈ శాఖల్లో సర్ధుబాటు చేయండి

August 2, 2022

తెలంగాణ రాష్ట్రంలోని ఆయా జిల్లాల్లో, మండలాల్లో రెవెన్యూ శాఖలో గతకొన్ని ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వీఆర్వోలకు కేసీఆర్ సర్కార్ మరో బిగ్ షాక్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఇకపై వీఆర్వోల వ్యవస్థ ఉండదంటూ, సుమారు రెండేళ్ల క్రితం ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వీఆర్వోలు అధికంగా ఉన్న సిబ్బందిగా గుర్తిస్తూ, ఇతర విభాగాల్లోకి వారిని సర్దుబాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ (జీవో నం. 121) ఆయా జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో రెవెన్యూ ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

విడుదల చేసిన జీవో ప్రకారం..”రాష్ట్రవ్యాప్తంగా 6,874 వీఆర్వో పోస్టులు ఉండగా, అందులో 5,885 మంది వీఆర్వోలు పనిచేస్తున్నారు. వీరంతా ఇతర శాఖల్లోకి బదిలీ అవుతారు. కొత్తగా కేటాయించే పోస్టులు జిల్లా, మండల, ఉప మండల కార్యాలయాల్లో ఉంటాయి. లాటరీ పద్ధతిలో శాఖల కేటాయింపు ఉంటుంది. వీఆర్వోల సంఖ్యకు సరిపడా ఆ జిల్లాలో పోస్టులు లేకుంటే పక్క జిల్లాలకు సర్దుబాటు చేయండి. మిగిలిపోయిన వీఆర్వోల జాబితాలను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించండి. కొత్త శాఖలకు కేటాయించిన తర్వాత కలెక్టర్ రీ-అపాయింట్‌మెంట్ ఉత్తర్వులు ఇవ్వండి. వ్యవసాయం, పశుసంవర్ధకం, బీసీ సంక్షేమం, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థికం, ఆరోగ్యం , విద్య, పౌరసర ఫరాలు, పోలీస్, గిరిజన సంక్షేమం, మహిళా అభివృద్ధి శాఖల్లో వీఆర్వోలను సర్దుబాటు చేయండి” అని పేర్కొన్నారు.

వీఆర్వోల సర్దుబాటు లాటరీ పద్ధతిలో కాకుండా సీనియారిటీ ప్రతిపాదికన ఆప్షన్లు ఇచ్చి నిర్వహించాలని ట్రెసా అధ్యక్ష, కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి, గౌతమ్ కుమార్ ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు. బదిలీచేసే క్రమంలో రెవెన్యూ శాఖలోని ఖాళీలను సైతం చూపించి, కొందరిని ఈ శాఖలోనే సర్దుబాటు చేయాలని విన్నవించారు. భూ సంబంధిత పనులతోపాటు సాధారణ పరిపాలన, వివిధ ఎన్నికలు, శాంతి భద్రతలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, వివిధ రకాల ధ్రువపత్రాల జారీ, వివిధ రకాల సంక్షే మ పథకాల అమలు కోసం లబ్ధిదారుల ఎంపిక వంటి పలు బాధ్యతలు రెవెన్యూ వ్యవస్థపై ఉన్నాయని, మండలానికి కనీసం ఐదుగురిని జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో అదనపు రెవెన్యూ ఇన్ స్పెక్టర్ల పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మరోపక్క ప్రభుత్వ ఉత్తర్వుల పట్ల రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. జీవోను 15 రోజుల్లో రద్దుచేయకుంటే నిరవధిక సమ్మె చేస్తామని, రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేస్తామని తెలంగాణ తహసీల్దార్ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు వి.లచ్చి రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.