Telangana again prohibits Chinese manja for Sankranti kites
mictv telugu

సంక్రాంతి వేళ పతంగులు ఎగురవేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే

January 13, 2023

Telangana again prohibits Chinese manja for Sankranti kites

సంక్రాంతి పండుగ వేళ ఆడవాళ్లయితే రంగురంగుల ముగ్గులు, పిండివంటలతో.. పెద్దలు కోడిపందేలతో చాలా బిజీగా ఉంటారు. ఇక పిల్లలు రంగురంగుల గాలి పటాలు.. ఎగురవేస్తూ, పండుగలో భాగమవుతారు. పతంగులు ఎగురవేయడానికి ప్రతి ఒక్కరు పోటీ పడుతుంటారు. కానీ పండగ సందర్భంగా ఎగురవేసే.. పతంగుల వల్ల పర్యావరణం, పక్షులకు హాని జరగకుండా చూడాలని అటవీ శాఖ కోరింది. పతంగులతో పాటు పక్షులనూ ఎగరనిద్దాం అనే నినాదంతో పండగ జరుపుకోవాలంటోంది.

నైలాన్, సింథటిక్ మాంజా (చైనీస్ మాంజా) వాడకం వల్ల అనర్థాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలని అభ్యర్థించింది. . కేంద్ర పర్యావరణ చట్ట ప్రకారం చైనీస్ మాంజా వాడకాన్ని నిషేధించినట్లు అటవీ శాఖ తెలిపింది. మానవులకు, మూగజీవులకు, పక్షులకు హాని కలుగుతుందనన కారణంతోనే వాటిని నిషేధించామని.. కాబట్టి వాటిని వాడవద్దని అధికారులు సూచిస్తున్నారు. చైనా మాంజాలను విక్రయించినా కూడా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

పాతబస్తీలోని చార్మినార్‌, గుల్జార్‌హౌజ్‌, ధూల్‌పేట్‌, కోఠి, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లోని.. పతంగులు, మాంజాల విక్రయాల దుకాణాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చైనా మాంజా విక్రయిస్తే ఐదేళ్ల ఖైదు, లక్ష జరిమానా ఉందని తెలిపారు. మాంజా వాడకం వల్ల మనుషులకు, పక్షులకు హాని జరిగితే 3 నుంచి 7 ఏళ్ల దాకా జైలు శిక్ష రూ.10 వేల జరిమానా విధిస్తారని అధికారులు తెలిపారు. నిషేధం అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 28 లక్షల రూపాయల విలువైన 1391 కిలోల దాకా చైనీస్ మాంజా సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. చైనీస్ మాంజా బదులు సంప్రదాయ కాటన్ దారాలను పతంగుల కోసం వాడాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం.డోబ్రియాల్ సూచించారు.