Telangana: Alert..Heavy rains till 5th of this month
mictv telugu

తెలంగాణ: అలర్ట్..ఈనెల 5 వరకు భారీ వర్షాలు

August 2, 2022

తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఉత్తర-దక్షిణ ద్రోణి దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా కొమరం ప్రదేశం వరకు సగటు సముద్రమట్టం నుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద స్థిరంగా కొనసాగుతుందని, దీనికి తోడు తమిళనాడుపై 1500 మీటర్ల ఎత్తున గాలులలో కూడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడ్డ కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆమె వెల్లడించారు.

”రాష్ట్రవ్యాప్తంగా నిన్న కూడా వర్షాలు కురిశాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలోని బంట్వారంలో 9.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జనగామ జిల్లాలోని అబ్దుల్ నాగారంలో అత్యల్పంగా 6.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత నెలలో తెలంగాణలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో సాధారణ వర్షపాతానికి (252.6 మిల్లీ మీటర్లు) మించి 300శాతం అదనపు వర్షపాతం (1011.2 మిల్లీ మీటర్లు) నమోదైంది. జులై నెలలో ఈ స్థాయిలో వర్షాలు పడడం చాలా అరుదు” అని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న వివరాలను వెల్లడించారు.

అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ నెల 5వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. కావున ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరారు. ముఖ్యంగా ఈ నెల 3న ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని, పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 4న కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 5న రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.