తెలంగాణలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. దసరా వరకు ఎలాంటి పరీక్షలు ఉండబోవని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో ఈ వారం జరగాల్సిన యూజీ, పీజీ, ఇంజినీరింగ్ పరీక్షలను వాయిదా వేశారు. పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులు షెడ్యూల్ చూసుకోవాలని సూచించారు.
ఓవైపు కరోనా, వర్షాల కారణంగా ఇప్పటికే ఓయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలను వాయిదా పడ్డాయి. మరోవైపు జేఎన్టీయూ, కాకతీయ యూనివర్సిటీలోని ఎంబీఏ, డిగ్రీ సెమిస్టర్, బీఈడీ పరీక్షలు నిలిపివేశారు. ఇటీవలే అక్టోబర్ 19, 20వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసి వాటిని ఈ నెల 21న నిర్వహిస్తామని ప్రకటించాయి. కానీ తీరా మరోసారి అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలపై ఇటీవల విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చిన వినతులపై మంత్రి కేటీఆర్ స్పందించి విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.