Telangana: All ready for the prelims exam..Hall tickets from the end of this month
mictv telugu

తెలంగాణ: అభ్యర్థుల్లారా..ఈనెల ఆఖరి నుంచే హాల్ టికెట్లు

July 12, 2022

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నెలలో నిర్వహించే ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలకు సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు తాజా విషయాలను వెల్లడిస్తూనే ఉన్నారు. సోమవారం రాత్రి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి మరో విషయాన్ని అభ్యర్థులకు తెలియజేసింది. ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్, ఆగస్టు 21న కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, ఈ నెల ఆఖరి నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.

అధికారులు మాట్లాడుతూ..”ఈసారి ఎస్సై ప్రిలిమ్స్‌కు 2.45,000 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరికి హైదరాబాద్, నగర పరిసర ప్రాంతాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నాం. గత రిక్రూట్‌మెంట్ (2018)లో 1.80 లక్షల మంది ప్రిలిమ్స్‌కు హాజరయ్యారు. అప్పట్లో దాదాపు అభ్యర్థులందరికీ హైదరాబాద్ నగర పరిధిలోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశాం. కానీ, ఈసారి ప్రిలిమ్స్‌కు దాదాపు 10 వేల మంది అదనంగా హాజరవుతున్నారు. కావున మరో 20 పట్టణాల్లోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. ఇందుకు బెంచీలు, కుర్చీలు, బల్లలు సహా అన్ని మౌలిక వసతులు ఉన్న కళాశాలలను ఎంపిక చేస్తున్నాం. మొత్తం 15,644 కానిస్టేబుల్, తత్సమాన పోస్టుల భర్తీకి ఆగస్టు 21న నిర్వహించనున్న ప్రిలిమ్స్‌కు 6,50,000 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు” అని అన్నారు.

అయితే, 2018 రిక్రూట్‌మెంట్‌తో పోలిస్తే, ఈసారి అభ్యర్థుల సంఖ్య 1.70 లక్షల మేర పెరిగిందని, హైదరాబాద్‌పాటు మరో 40 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థుల తమ దరఖాస్తుల్లో ఆప్షన్ ఇచ్చిన ప్రకారమే.. వీలైనంత మేరకు పరీక్ష కేంద్రాలను కేటాయించేలా ఈ ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ నెలాఖరు నుంచి ఎస్సై అభ్యర్థులకు తమ హాల్‌ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతున్నామని, అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు. ఇక, ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానంలోనూ హాజరు తీసుకోనున్నామని, ఇందుకు అవసరమైనన్ని బయోమెట్రిక్ డివైజ్‌లను సేకరిస్తున్నట్టు అధికారులు తెలిపారు.