Telangana assembly sessions will start from September 6
mictv telugu

తెలంగాణ : రేపు కేబినెట్ భేటీ.. 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు

September 2, 2022

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఈ నెల 3న కేబినెట్ భేటీ నిర్వహించి, చర్చించాల్సిన అంశాలు, ప్రవేశపెట్టే బిల్లుల గురించి చర్చించనున్నారు. ఆరో తేదీన ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుండగా, అదే రోజు బీఏసీ సమావేశం జరుగనుంది. ఈ మేరకు శాసనమండలి కార్యదర్శి వి నరసింహాచార్యులు శుక్రవారం వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలతో పాటు మండలి సమావేశాలు కూడా జరుగుతాయని ఆయన తెలిపారు. మార్చి 15న ముగిసిన బడ్జెట్ సెషన్‌కి కొనసాగింపుగా ఈ సమావేశాలు ఉండనుండగా, అప్పుడు స్పీకర్ సభను వాయిదా వేశారు. ప్రొరోగ్ చేయలేదు. అటు అసెంబ్లీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని సమాచారం. అటు విపక్షాలు కూడా ఇటీవల చోటుచేసుకున్న అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఇబ్రహీం పట్నం కు.ని ఆపరేషన్ల విఫలం, రైతు రుణమాఫీ గురించి అధికార టీఆర్ఎస్‌ను ఎండగట్టాలని భావిస్తున్నాయి.