తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన కేసీఆర్ సర్కార్.. ఇవాళ్టి నుంచి బుధవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతోపాటు కాలేజీలకు, యూనివర్సిటీలకు సెలవులను ప్రకటించింది. అంతేకాదు, ప్రజలు, పిల్లలు, యువకులు ఇంటి నుంచి బయటికి రావొద్దని తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
ఈ క్రమంలో హైదారాబాద్లో ఉన్న వాతావరణ శాఖ అధికారులు నేడు మరో విషయాన్ని ప్రజలకు తెలియజేశారు. ”తెలంగాణకు ఇంకా వాన ముప్పు పొంచే ఉంది. రాష్ట్రంలో ఇవాళ, రేపు కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణపై ఉన్న మేఘాల ఉద్ధృతి నమూనాలను పరిశీలించి చూస్తే, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 35 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా రాష్ట్రంపై దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు మరింత భారీగా పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇక, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ముసురుపట్టి మూడు రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది” అని ఓ ప్రకటన విడుదల చేశారు.
మరోపక్క శనివారం నుంచి ఆదివారం వరకు కురిసిన వర్షంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జులై నెలలోనే అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఏకంగా 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, దీంతో నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 61 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.