తెలంగాణ రాష్ట్రంలో రెండు వారాల క్రితం వరుసగా ఐదు రోజులపాటు ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఆ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్నీ పట్టణాల్లో, పల్లెలోని గుంతలు, వంతెనలు, చెరువులు, ప్రాజెక్ట్‌లు, వరద ప్రవాహంతో కొన్ని ఊర్లు, పొలాలు నిండిపోయి, ప్రజలు నానా అవస్థలు పడ్డారు. గత మూడు రోజులుగా ఇప్పుడిప్పుడే ఆ వరద ప్రవాహం నుంచి బయటపడుతున్న క్రమంలో నిన్న ఉదయం నుంచి రాత్రివరకు కురిసిన భారీ వర్షానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ..ఇవాళ, రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని శనివారం ఓ ప్రకనట విడుదల చేసింది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అంతేకాదు, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ వాసులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. ఎందుకంటే శుక్రవారం హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వాన కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. హైదరాబాద్‌లో పలుచోట్ల 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో చిరువ్యాపారులు, స్కూల్ పిల్లలు, వాహనదారులు అనేక అవస్థలు పడ్డారు. ఇక, రాష్ట్రంలో అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకు 21 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 10 నుంచి 20 సెంటీ మీటర్ల మధ్య వర్షం కురిసిందని టీఎస్‌డీపీఎస్ తెలిపింది.
మరో రెండు రోజులు గ్రేటర్ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్‌ను అధికారులు జారీచేశారు.