Telangana: BeAlert: Heavy rains today..in this district
mictv telugu

తెలంగాణ: బీఅలర్ట్: నేడు అతి భారీ వర్షాలు..ఈ జిల్లాలోనే

September 9, 2022

తెలంగాణ రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ గురువారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. మిగిలిన జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని ప్రకటనలో పేర్కొంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

గతరాత్రి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం కురిసింది. ఏఎస్‌రావునగర్‌లో అత్యధికంగా 8.0 సెంటీమీటర్ల వర్షం పడింది. నేరేడ్‌మెట్‌, సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌, మచ్చబొల్లారం, కుషాయిగూడ, బంజారాహిల్స్‌, కుత్బుల్లాపూర్‌లో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో వాతావరణ శాఖాధికారులు హైదరాబాద్‌కు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

ఈ క్రమంలో శుక్రవారం రోజున ఏఏ జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందనే విషయాన్ని తెలియజేస్తూ, అధికారులు ఆరెంజ్‌ హెచ్చరికను జారీ చేశారు. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదంటూ ఎల్లో హెచ్చరిక జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.