మెడికో ధరావత్ ప్రీతిది ఆత్మహత్య కానే కాదని, పక్కా హత్య అని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. ప్రీతి నిజానికి వరంగల్‌లోనే చనిపోయిందని, నిందితులను కాపాడ్డానికి ఆత్మహత్య పేరుతో డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ చేస్తున్నప్రీతి అనుమానాస్పద స్థితిలో చనిపోవడం తెలిసిందే. దీనిపై పలు విమర్శలు వస్తున్నాయి. బండి సంజయ్ తొలి నుంచీ ఇది హత్యే అంటున్నారు. తాజాగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మళ్లీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ప్రీతి ఆ రోజు వరంగల్లోనే చనిపోయింది. గొడవ అవుతుందని హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ఆమె డెడ్ బాడీకి నాలుగు రోజులు చికిత్స చేశారు. నిందితుడు సైఫ్‌ను హీరోను చేస్తున్నారు,’’ అని సంజయ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులు పక్కా పథకం ప్రకారం నీరుగారుస్తోందని ఆరోపించారు.
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వస్తున్న ఆదేశాల ప్రకారమే పోలీసులు నడుచుకుంటున్నారని, సైఫ్‌ను కాపాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రీతి పోస్టు మార్టమ్ రిపోర్టులో ఆమె విషపు ఇంజెక్షన పుచ్చుకున్నట్లు ఆధారాలు లేకపోవడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. ప్రీతి కుప్పకూలిన రోజు సైఫ్ అక్కడే ఉన్నాడని ఆమె తండ్రి ఆరోపిస్తున్నాడు. ఎవరో ప్రీతి సెల్ ఫోన్ తీసుకుని, పాయిజన్ ఇంజెక్షన్ వివరాల కోసం గూగుల్ చేసి, కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నాడు. హోం మంత్రి మహమూద్ అలీ తనకు బంధువని సైఫ్ బెదిరించేవాడని ఆరోపిస్తున్నాడు.