బండి సంజయ్ దీక్ష భగ్నం.. అరెస్ట్ చేసిన పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

బండి సంజయ్ దీక్ష భగ్నం.. అరెస్ట్ చేసిన పోలీసులు

August 23, 2022

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్‌ చేశారు. తమ పార్టీ నేతలపై దాడులకు నిరసిస్తూ ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ మండలం పామ్నూర్ లో బండి సంజయ్ దీక్ష తలపెట్టారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. దీక్షను భగ్నం చేసి ఆయన్ని అరెస్ట్‌ చేశారు. బీజేపీ కార్యకర్తల తీవ్ర ప్రతిఘటనల మధ్య సంజయ్‌ను పోలీసులు బలవంతంగా వాహనంలోకి ఎక్కించారు. మార్గంమధ్యలో పోలీసు వాహనాలను కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా పక్కకు తొలగించారు. ఈ క్రమంలో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.

ఇక బండి సంజయ్‌ పాదయాత్రపై టీఆర్‌ఎస్‌ దాడి చేసే అవకాశం ఉందని కేంద్రానికి నిఘా వర్గాలు నివేదించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేత తరుణ్ చుగ్ సహా కేంద్ర పెద్దల బండి సంజయ్‌ను ఫోన్‌లో పరామర్శించారు. దాడి నేపథ్యంలో భద్రత పెంచేందుకు పోలీసులు సిద్ధం కాగా, ఆ భద్రతను బండి సంజయ్ తిరస్కరించారు.‘నా భద్రత సంగతి కార్యకర్తలే చూసుకుంటారని ఆయన పోలీసులతో తేల్చి చెప్పినట్లు సమాచారం.

కార్యకర్తలకు ఏదైనా జరిగితే కేసీఆర్ సర్కార్ అంతు చూస్తామని హెచ్చరించిన బండి సంజయ్‌.. పాదయాత్ర శిబిరం వద్ద ‘‘కేసీఆర్ కుటుంబ దమన నీతిపై ధర్మదీక్ష’’కు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బండి సంజయ్ పాదయాత్ర శిబిరం వద్ద ముందుగానే మోహరించిన పోలీసులు.. ఆయన భద్రతా కారణాల దృష్ట్యా అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాలరాస్తోందని బీజేపీ నేతలు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. లిక్కర్‌ స్కామ్‌లో కేసీఆర్‌ కుటుంబం పాత్రను తేల్చేంతవరకు తాము నిరసనలు కొనసాగిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు.