Telangana BJP Chief Bandi Sanjay said that TRS is degrading the governorship system
mictv telugu

రాష్ట్ర ప్రథమ పౌరురాలిని టీఆర్ఎస్ అవమానిస్తోంది.. బండి సంజయ్

September 9, 2022

గత మూడేళ్లుగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానంటూ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. గవర్నర్ తమిళిసై వాస్తవాలు మాట్లాడారని అన్నారు. గవర్నర్ వ్యవస్థను టీఆర్ఎస్ కించపరుస్తోందని, గవర్నర్ పై బీజేపీ ముద్రవేసి అవమానిస్తున్నారన్నారు. గవర్నర్ వాస్తవాలు మాట్లాడితే టీఆర్ఎస్ వాళ్లకు నచ్చడం లేదని బండి సంజయ్ అన్నారు.

గవర్నర్ కార్యాలయాన్ని గౌరవించాలని , రాజ్ భవన్ వద్ద కల్వకుంట్ల రాజ్యాంగం అమలు చేసినట్టు కాకుండా, ప్రోటోకాల్ కు కట్టుబడి ఉండడం నేర్చుకోవాలని బండి సంజయ్ టీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు. గవర్నర్ తమిళిసై గారు పార్టీలకు అతీతంగా నిజాలే మాట్లాడారని, కానీ టీఆర్ఎస్ మాత్రం గవర్నర్ పై బీజేపీ ముద్ర వేస్తోందని మండిపడ్డారు. ఈ రాష్ట్ర ప్రథమ పౌరురాలిని టీఆర్ఎస్ అవమానిస్తోందని, ఇది సిగ్గుచేటని తీవ్రంగా విమర్శించారు.