తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కొడుకు భగీరథ తన తోటి విద్యార్థులను చావగొడుతున్న వీడియోలు కలకలం రేపుతున్నాయి. అది పిల్లల వ్యవహారమైనా వీడియోలు బయటపడిన సందర్భంపై పలు ఊహాగానాలు వస్తున్నాయి. బండి సంజయ్ అంటే గిట్టని స్వపక్ష నేతల హస్తం ఇందులో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం బండి సంజయ్.. వెంకయ్య నాయుడిలా అద్భుతంగా మాట్లాడతారని పొగిడిన రోజే ఈ పాత వీడియోలు బయటికి రావడం యాదృచ్ఛికం కాదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.
తప్పిస్తారా?
బండి సంజయ్ పనితీరు బాగాలేదని, ఆయన స్థానంలో రాష్ట్ర బీజేపీ పగ్గాలను ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు అప్పగిస్తారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే బండిని పక్కకు తోసే పరిస్థితి లేదని, ఆయన రాష్ట్రంలో బీజేపీ బలపడ్డానికి చాలా కృషి చేశారు కాబట్టి కేంద్ర మంత్రి పదవి ఇస్తారని కూడా కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బండి అంటే గిట్టని సొంత పార్టీవాళ్లే భగీరథ దాడి విషయాన్ని ఉద్దేశపూర్వకంగా బయటపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. బండి కొడుకు ధాష్టీకాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి చిక్కుల్లో పడెయ్యాలనే వ్యూహం ఇందులో ఉందంటున్నారు. బండి కూడా ఈ వీడియోలపై సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. నష్ట నివారణ జరగకుండా వెంటనే.. దెబ్బలు తిన్న ఇద్దరు కుర్రాళ్లలో ఒకరితో సోషల్ మీడియాలో మాట్లాడించడం, భగీరథ తనకు మంచి మిత్రుడంటూ కితాబు ఇవ్వడం ఇందులో భాగమంటున్నారు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలేనని, ఇది టీకప్పులో తుఫాను వంటిది కూడా కాదని, పక్కా పిల్లల కొట్లాట అని పెద్దలు ముక్తాయిస్తున్నారు. దెబ్బలు తిన్న కుర్రాడి వెర్షన్ ప్రకారం భగీరథపై కేసు నిలవదని చెబుతున్నారు.