ఈ దేశంలో సామాన్యుడికి బ్యాంకు నుంచి అప్పు పుట్టాలంటే సవాలక్షా కండీషన్లు ఉంటాయి కానీ అదే ప్రముఖ వ్యాపారవేత్తలు, బడా రాజకీయ నాయకులు, కేంద్రం అండ ఉన్న వారికి మాత్రం త్వరగా బ్యాంకులు లోన్లు మంజూరు చేస్తాయ్. ఏదో వేలల్లో, లక్షల్లో కాదు… కోట్లల్లోనే. పెద్ద పెద్ద బిజినెస్ మేన్‌లంతా బ్యాంకుల నుండి లోన్లు తీసుకోవడం, వాటిని ఎగ్గొట్టడం, బ్యాంకులు వారి నుంచి అప్పు వసూలు చేయలేక చేతులెత్తేయడం, తిరిగి అడగకుండా కేంద్రం ప్రభుత్వాన్ని ఆశ్రయించడం.. ఇలాంటవన్నీ డైలీ న్యూస్ ఫాలో అయ్యేవారికి చెప్పాల్సిన పని లేదు. సదరు ప్రముఖ వ్యాపార వేత్తలు ఏ టెక్నిక్ వాడారో.. తెలంగాణలోని ఇద్దరు బీజేపీ నేతలు కూడా అదే బాటలో నడిచారు. రుణాల పేరుతో జనం సొమ్ము ఎగ్గొట్టిన వారికి బీజేపీ అడ్డాగా మారిందని ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సమయంలో వీరు కూడా ఇలా చేయడం ఆ విమర్శలకు బలాన్ని చేకూర్చుతుంది.
వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి, బీజేపీ మహిళా నేత రుద్రమ దేవి ఇద్దరూ లక్ష్మీ విలాస్ బ్యాంక్ నుండి పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నారు. నగరంలోని హయత్ నగర్, మన్సూరాబాద్ పరిధిలోని మెస్సర్స్ జె వి ఆర్ హోటల్స్ అండ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, మెస్సర్స్ రుద్రమాన్ బోటిక్, ఇతర చిన్న చిన్న కంపెనీల పేరుతో వీరిద్దరూ కలిసి మొత్తం దాదాపు 20 కోట్లకు పైగా రుణాలు తీసుకున్నారు.
రుణాలు తీసుకున్న తరువాత తిరిగి చెల్లించడానికి నిరాకరించారు. అయితే ఆ బ్యాంకు వారి ఆస్తులను వేలం వేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. రుణాలు తీసుకున్న తరువాత చెల్లించకపోవడంతో చివరకు వారి ఆస్తులను రిలయన్స్ అస్సెట్స్ రీ కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా ఈ-వేలం వేయడానికి పత్రికా ప్రకటన వెలువడింది. సదరు బ్యాంకు వీరిద్దరి మీద చట్టపరమైన చర్యలకు సిద్దమైంది. మరి బీజేపీలో ఉన్నారు కాబట్టి.. ఆ అప్పులు ఎలా రద్దు చేయాలో, బ్యాంకుల నోళ్లు ఎలా మూయించాలో, ఈ అప్పుల నుంచి ఎలా గట్టెక్కాలో.. అన్ని ప్లాన్లను ఇప్పటికే అమల్లో పెట్టే ఉంటారు.