ఏపీ సీఎం జగన్ తీరుతో హిందూ దేవుళ్లకు చెడ్డపేరు వస్తోందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు. తిరుపతిలోని అలిపిరి చెక్ పోస్టు వద్ద వాహనాలపై హిందూ దేవుళ్ల స్టిక్కర్లను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మహారాష్ట్ర భక్తులను అవమానించే రీతిలో ఛత్రపతి శివాజీ విగ్రహాం ఉన్న వాహనాన్ని నిలిపివేశారని.. పోలీసులు అలాంటి వాహనాలను అనుమతించమని చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. దీని వల్ల ఆ రాష్ట్రంలో పెద్దఎత్తున నిరసన వ్యక్తమవుతోందన్నారు. మహారాష్ట్ర సోషల్ మీడియాలో బాయ్‌కాట్ తిరుపతి అంశం వైరల్ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అలిపిరి వద్ద శివాజీ స్టిక్కర్లతో ఉన్న వాహనాలను అడ్డుకోవడం.. ప్రస్తుతం మహారాష్ట్రలో ఇది పెద్ద వివాదంగా మారిందని రాజాసింగ్ తెలిపారు. మహారాష్ట్రలో సోషల్ మీడియాలో బాయ్‌కాట్ తిరుపతి అనడం ప్రస్తుతం వైరల్‌గా మారిందన్నారు. ఏపీ సీఎం జగన్ తప్పుడు నిబంధనలు తీసుకురావడమే ఈ వివాదానికి కారణమన్నారు. జగన్ ఏ దేవుడిని నమ్ముతారో దేశ ప్రజలకు తెలుసని రాజాసింగ్ ఆరోపించారు.