హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో తెలంగాణ బీజేపీ కీలక ప్రకటన చేసింది. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డి గురువారం ప్రకటించారు. పార్టీలో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసున్నట్లు గురువారం మీడియాకు వెల్లడించారు. నేటి సాయంత్రంతో నామినేషన్ల గడువు ముగుస్తుండగా.. చివరి నిమిషంలో బీజేపీ పోటీపై వెనక్కి తగ్గింది. మొన్నటివరకు పోటీ చేసే విషయంపై టీ బీజేపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం విషయంలో మిత్రపక్షమైన ఎంఐఎంకు మద్దతు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ.. ఈ ఎన్నికలో పోటీ చేయకూడదనే ఆలోచనలో పడినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాము పోటీ చేయడం లేదని బీజేపీ నుంచి ప్రకటన వెలువడింది.
ఇక, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎంఐఎం తమ పార్టీ అభ్యర్థిగా మీర్జా రెహమత్ బేగ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ఈరోజు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నికకు సంబంధించి మొత్తం 127 ఓట్లు కాగా.. అందులో 9 ఖాళీగా ఉన్నాయి. దీంతో 118 మందికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. అంటే 60 ఓట్లు వస్తే గెలిచినట్టుగా లెక్క. పార్టీల వారీగా.. ఎంఐఎంకు 52, బీఆర్ఎస్‌కు 41, బీజేపీకి 25 ఓట్లు ఉన్నాయి. అయితే ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో.. ఆ పార్టీ అభ్యర్థి ఎన్నిక లాంఛనం కానున్నట్టుగా భావించాల్సి ఉంటుంది.