వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 80 సీట్లు వస్తాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఎంఐఎంకు పోయే సీట్లు తప్ప మిగతావన్నీ తమకే దక్కుతాయని బీఆర్ఎస్ పార్టీ నేతలు ధీమాగా చెబుతుంటే మంత్రి ఇలా చెప్పడం విస్మయం కలిగిస్తోందంటున్నాయి పార్టీ శ్రేణులు. దీంతో ఎర్రబెల్లి మాట మార్చారు. మీడియా తన మాటలను వక్రీకరించిందని చెప్పుకొచ్చారు.
అసలేమన్నారు?
ఎర్రబెల్లి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ‘‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల బలాలపై సర్వే చేశాం. బీఆర్ఎస్కు 80 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి చెరో 10 సీట్లు వస్తాయని తేలింది. 20 మంది ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉంది. వారిని మార్చేస్తే వంద సీట్లు వస్తాయి. 80 లేదా సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఆరేడు జిల్లాల్లోను, బీజేపీ-బీఆర్ఎస్ మధ్య మూడు నాలుగు జిల్లాల్లో మాత్రమే పోటీ ఉంటుంది. మిగతా చోట్ల బీఆర్ఎస్కు పోటీ లేదు.’ అని అన్నారు. దీనిపై పార్టీ నుంచి విమర్శలు రావడంతో, తన అలా అనలేదని బుధవారం వివరణ ఇచ్చారు. ‘‘బీఆర్ఎస్ 80 సీట్లు పక్కాగా గెలుస్తుంది. మరో 20 సీట్లు కోసం గట్టిగా కష్టపడాలని మాత్రమే చెప్పాను. బీఆర్ఎస్కు వంద సీట్లు పక్కాగా వస్తాయి’ అని చెప్పారు.