తెలంగాణ: కాలి బూడిదైన రైలు బోగీ..పరుగెత్తిన ప్రయాణికులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ: కాలి బూడిదైన రైలు బోగీ..పరుగెత్తిన ప్రయాణికులు

July 3, 2022

తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా ఘట్‌కేసర్‌-పగిడిపల్లి మధ్య రైలులోని ఓ బోగిలో ఒక్కసారిగా మంటలు చేలరేగి, ప్రయాణికులు పరుగులు తీసిన ఘటన శనివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. కొద్ది నిమిషాల్లోనే రైలు బోగీ కాలి బూడిదైంది. ప్రయాణికులకు ఏం చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతూ, అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని, మంటలను మరిన్ని బోగీలకు వ్యాపించకుండా అదుపు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. శనివారం అర్దరాత్రి సికింద్రాబాద్‌ నుండి ఢిల్లీకి దక్షిణ్‌ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరింది. సరిగ్గా యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఘట్‌కేసర్‌-పగిడిపల్లి మధ్యలో రైలు బోగీలో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. అయితే ఆ బోగీ చివరిది కావడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని మాపక సిబ్బంది 8 ఫైర్‌ ఇంజిన్లతో ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, మంటలు అంటుకున్న బోగీ లగేజీ క్యారియర్ అని, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు గాని, ప్రాణం నష్టం గాని జరగలేదని రైల్వే అధికారులు వివరాలను వెల్లడించారు.