తెలంగాణ నుంచి వేల సంఖ్యలో ప్రతీ ఏడాది భక్తులు కాశీ యాత్రకు, శబరిమల యాత్రకు వెళ్తుంటారు. అయితే అలా ఆయా ప్రాంతాలకు వెళ్లే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. ఆయా పుణ్యక్షేత్రాల్లో తెలంగాణ నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్థం వసతిగృహాలను నిర్మించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. సనాతన ధర్మాన్ని పాటించే చాలా మంది భక్తులు కాశీకి వెళ్తుంటారు. రాష్ట్రం నుంచి కాశీయాత్రకు పెద్ద ఎత్తున భక్తులు వెళ్తున్న నేపథ్యంలో కాశీలో కూడా తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఒక వసతి గృహం నిర్మించాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. వీలైనంత త్వరగా తెలంగాణ ప్రభుత్వ అధికారులతో కాశీ పర్యటన జరిపి.. అక్కడి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి, స్థలం దొరక్క పోతే ప్రైవేటు స్థలమైనా కొని రూ.25కోట్లతో అన్ని వసతులతో సముదాయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
అదే విధంగా శబరిమలకు వెళ్లిన సమయంలో కూడా రాష్ట్రం నుంచి వెళ్లిన భక్తులకు ఇబ్బంది జరుగుతున్నదని, అక్కడ కూడా రూ.25కోట్లతో రాష్ట్రం తరఫున వసతి గృహం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు హరీశ్ రావు. ఎంతో నిష్ట, భక్తితో అయ్యప్ప భక్తులు ఉపవాస దీక్షను నిర్వహిస్తూ వస్తుంటారని, అలాంటి వారి కోసం అని వసతులతో కూడిన భవనం నిర్మించాలని కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. దీనికి సంబంధించిన బాధ్యతలు సీఎంవో అధికారిణి ప్రియాంక వర్గీస్‌కు అప్పగించారు. గతంలోనే సీఎం కేసీఆర్ కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడినప్పుడు.. శబరిమలలో మంచి స్థలం ఇచ్చేందుకు ఆ రాష్ట్ర సీఎం అంగీకరించారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.