రేపే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. కేసీఆర్ ఆదేశం
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాజ్ భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషిని ఆదేశించారు. ఆదివారం దశమి కావడంతో రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా తమిళసై ఉదయం 11 గంటలకు ప్రమాణం చేస్తారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్ ఆమెతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు కొత్త గవర్నర్ చేతుల మీదుగా కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం జరుగుతుంది.
2018 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తొలిసారి కేసీఆర్ ముఖ్యమంత్రిగా, మహమూద్ అలీ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఫిబ్రవరి 19న మరో 10 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రివర్గాన్ని విస్తరించే క్రమంలో కేసీఆర్ ఎంతమందికి అవకాశం కల్పిస్తారని రాజకీయ వర్గాల్లో చర్చలు జరిగాయి. ఆశావహుల పైరవీలు, చివరి ప్రయత్నాలు కూడా జరిగాయి. అయితే, ఈసారి కేసీఆర్ ఎవరూ ఊహించని రీతిలో కొత్త గవర్నర్ వస్తున్న రోజే కొత్తగా కేబినెట్‌ను విస్తరిస్తున్నారు.