Telangana: Candidates... Applications from today
mictv telugu

తెలంగాణ: అభ్యర్థుల్లారా..నేటి నుంచే దరఖాస్తులు

July 22, 2022

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన నిరుద్యోగులకు, డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థినీ, విద్యార్థులకు అలాగే గ్రూప్-1 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బీసీ సంక్షేమ శాఖ శుభవార్తను చెప్పింది. గ్రూప్-1 పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్ధులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు బీసీ సంక్షేమ శాఖ సిద్ధమైందని, నేటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ మొదలుకానుందని అధికారులు తెలిపారు. వెయ్యి మంది నిరుద్యోగులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ గ్రూప్-1 శిక్షణకు సంబంధించి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో..”నేటి (శుక్రవారం) నుంచి గ్రూప్-1 పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తుల ప్రక్రియ మొదలు అవుతుంది. వెయ్యి మంది నిరుద్యోగులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. ఈ శిక్షణకు డిగ్రీ ఉత్తీర్ణులైన వారు, గ్రూప్-1 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు అర్హులు. ఈ నెల 22 నుంచి 29 వరకు ఆల్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోండి. పూర్తి వివరాలకు www.tsbcstudyciecle.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి, దరఖాస్తు చేసుకోండి. కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి” అని హైదరాబాద్ జిల్లా బీసీ సంక్షేమాధికారి జి ఆశన్న తెలిపారు.

అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సివిల్స్- 2025 కోసం సన్నద్ధమయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రాజేంద్రనగర్‌లోని ‘గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్’ శుభవార్తను చెప్పింది. ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ ఇచ్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోందని పేర్కొంది. మొత్తం 100 మంది అభ్యర్థులకు రెసిడెన్షియల్ విధానంలో ఉచితంగా శిక్షణ ఇస్తామని, ప్రిలిమ్స్, మెయిన్స్ కలిపి 9 నెలలపాటూ తర్ఫీదు ఇస్తామని అన్నారు. మంగళవారం నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని, ఆగస్టు 10 తేదీ తుది గడువు అని హైదరాబాద్ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కేఈ రామేశ్వరీ దేవి తెలిపారు. విద్యార్థులు www.studycircle.cgg.gov.in వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. డిగ్రీ పూర్తె 21-37 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులని తెలిపారు.