Telangana: Candidates are responsible for it
mictv telugu

తెలంగాణ: అభ్యర్థులే దానికి బాధ్యులు

September 13, 2022

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ నెల 4వ తేదీ రాత పరీక్ష జరిగింది. పరీక్ష ఫలితాలను రెండు రోజులక్రితం జేఎన్టీయూహెచ్ డైరెక్టర్ శ్రీ విజయ్ కుమార్ రెడ్డి, సింగరేణి డైరెక్టర్ (పర్సనల్) ఎస్.చంద్రశేఖర్ విడుదల చేశారు. అయితే, ఆ ఫలితాల్లో కొన్ని విచిత్ర పేర్లతో అభ్యర్థుల పేర్లు కన్పించాయి. అందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, డిగ్రీ, బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ అనే పేర్లతో ఫలితాలు విడుదల కావడంతో సోషల్ మీడియాలో సింగరేణి ఫలితాల లిస్ట్ తెగ వైరల్ అయ్యింది.

ఈ ఘటనపై తాజాగా సింగరేణి డైరెక్టర్‌ ఎస్‌ చంద్రశేఖర్‌ వివరణ ఇచ్చారు. ”సింగరేణిలో 177 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ఫలితాల్లో కొందరు అభ్యర్థుల పేర్లు తప్పుగా వచ్చాయి. దాంతో ఆయా పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో పలు కథనాలు ప్రచురించబడ్డాయి. 177 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులను స్వీకరించాం. ఆ క్రమంలో కొంతమంది అభ్యర్థులు పొరపాటుగా వారి పేరు స్థానంలో తప్పుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, డిగ్రీ, బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ అని టైప్‌ చేశారు. మెరిట్‌ జాబితాలో పేర్లు పొరపాటుగా రావడానికి అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు నింపే సమయంలో చేసిన తప్పిదమే అసలు కారణం. ఈ విషయాన్ని ప్రతిఒకరూ గమనించాలి. ఆ పొరపాటుకు అభ్యర్థులే బాధ్యులు” అని ఆయన అన్నారు.

ఇక, పరీక్ష విషయానికొస్తే..తెలంగాణలోని 8 జిల్లాల్లోని 187 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష పకడ్బందీగా నిర్వహించారు. పరీక్షకు మొత్తం 98,882 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 77898 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. ఈసారి నెగటివ్ మార్కింగ్ విధానంలో పరీక్ష నిర్వహించారు. ఇందులో 49,328 మంది అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు సాధించారు. 28570 మంది పరీక్షలో క్వాలిఫై కాలేదు.