ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేయడంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. నిజం బయటికి కావాలంటే అరెస్టులు, విచారణలు తప్పనిసరి అని కొన్ని పార్టీలు అంటుంటే, మరికొన్ని ఇది బీజేపీ కక్ష సాధింపు ధోరణి అని మండిపడుతున్నాయి. ఆయన అరెస్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఘాటుగా స్పందించారు. ఈమేరకు సోషల్ మీడియాలో ప్రకటన చేశారు.
‘‘ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది అదానికి ప్రధాని మోడీకి నడుమనున్న అనుబంధం నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికి చేసిన పనే తప్ప మరోటి కాదు’’ అని అన్నారు. కుంభకోణంలో కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఉందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేశారు.
మరోపక్క.. సిసోడియాను ఢిల్లీ కోర్టు ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. మార్చి 4 వరకు కస్టడీలో ఉండాలని ఆదేశించింది. ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టాలని, అడిగిన ప్రశ్నలకు బదులివ్వకుండా తప్పించుకుంటున్నారని సీబీఐ కోర్టులో ఫిర్యాదు చేసింది. సిసోడియాను ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారు. మద్యం కంపెనీల నుంచి అందిన వందల కోట్ల ముడుపులను ఆప్ గోవా ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు ఈడీ, సీబీఐ చెబుతున్నాయి.