తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కడుపులో కొంచెం నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఏఐజీ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సీఎంకు కావాల్సిన అన్ని వైద్య పరీక్షలు చేయించారు. సీటీ స్కాన్, ఎండోస్కోపీ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ పరీక్షల్లో సీఎంకు కడుపులో చిన్న అల్సర్ ఉన్నట్లుగా తేలింది. మందులతో ఆ అల్సర్ తగ్గిపోతుందని వైద్యులు తెలిపారు. అల్సర్ మినహా మిగతా అన్ని పారామీటర్స్ నార్మల్‌గా ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. దాంతో అల్సర్ తగ్గడానికి అవసరమైన మెడికేషన్‌ను ప్రారంభించారు.
ఇవాళ మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో కవితతో కేసీఆర్ భేటీ అయ్యారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఈడీ విచారణ, ఈ నెల 16న జరగనున్న విచారణ గురించి చర్చించారు. ఈ భేటీలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా పాల్గొన్నారు. నిన్నటి ఈడీ విచారణ జరిగిన తీరు గురించి కవిత ద్వారా కేసీఆర్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈడీ విచారణ జరిగిన తీరు గురించి కేసీఆర్‌కు కవిత సుదీర్ఘంగా వివరించారు. అనంతరం ఈ నెల 16న జరగనున్న విచారణ గురించి పలు అంశాలు చర్చించారు. విచారణలో ఎలా వ్యవహరించాలనే దానిపై కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ సమావేశం జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు.